దేశం కంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ ఎక్కువా? : హర్భజన్ సింగ్

by Harish |

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఇక ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది.

దేశం కంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ ఎక్కువా? : హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఇక ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ టోర్నీలో పాక్‌తో రెండు మ్యాచ్‌లను భారత మాజీ క్రికెటర్లు రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభంగానున్న ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని వ్యాఖ్యానించాడు. దేశం కంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ ముఖ్యమైంది కాదన్నాడు.

‘ఏది ముఖ్యమైనదో ఏది కాదో అర్థం చేసుకోవాలి. కుటుంబాలను వదిలిపెట్టి, జీవితాలను త్యాగం చేసి బోర్డర్ వద్ద పోరాడే సైనికులే నాకు ముఖ్యం. వారి త్యాగాలతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. ఒక్క క్రికెట్ మ్యాచ్‌ ఆడకుండా ఉండలేమా?.’అని వ్యాఖ్యానించాడు. అన్నింటి కంటే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ‘ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో ఉంది. రక్తం, చెమట కలిసి ఉండవు. సరిహద్దుల్లో గొడవలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న స్థితిలో క్రికెట్ ఆడేందుకు వెళ్లడం సరైంది కాదు. పెద్ద సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పోలిస్తే క్రికెట్ చాలా చిన్న విషయం. ఈ దేశం వల్లే మనకు గుర్తింపు. ప్లేయర్‌గానీ, నటుడుగానీ, ఇంకెవరైనా గానీ దేశం కంటే ఎవరూ పెద్ద వారు కాదు. అన్నింటి కంటే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ బాధ్యతను మనం అందరం పూర్తి చేయాలి. దేశంతో పోలిస్తే ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడకపోతే ఏం కాదు.’అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.


Next Story