చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్‌.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్

by Yella Dhawani Reddy |

దక్షిణ కొరియాలో మంగళవారం ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజున భారత్ మంచి శుభారంభం చేసింది.

చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్‌.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియాలో (South korea) గుమిలో మంగళవారం ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (Asian Athletics Championships) తొలి రోజున భారత్ మంచి శుభారంభం చేసింది. పురుషుల 10,000 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ (Gulveer Singh ) బంగారు పతకంతో మెరిశాడు. 26 ఏళ్ల గుల్వీర్ 28 నిమిషాలు 38.63 సెకన్లలో పరుగు పూర్తి చేసి భారత్ ఖాతాలో తొలి స్వర్ణాన్ని చేర్చాడు. అంతేకాదు, ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన మూడవ భారతీయుడిగా గుల్వీర్ నిలిచారు. అంతకుముందు హరి చంద్ (1975), జి. లక్ష్మణన్ (2017) ఈ ఘనత సాధించారు. ఇక జపాన్‌కు చెందిన మెబుకి సుజుకీ రజతం (28:43.84), బహ్రెయిన్‌కు చెందిన ఆల్బర్ట్ కిబిచీ రాప్ కాంస్యం (28:46.82) గెలుచుకున్నారు.

అంతకుముందు ఉదయం జరిగిన 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సర్విన్ సెబాస్టియన్ (Servin Sebastian) భారత్‌కు తొలి పతకం తీసుకొచ్చాడు. ఆయన 1 గంట 21 నిమిషాలు 13.60 సెకన్లలో ముగించి కాంస్య పతకం సాధించాడు. ఇది అతని వ్యక్తిగత ఉత్తమ టైమింగ్ (1:21:23)కు దగ్గరగా ఉంది. ఇక ఈ చాంపియన్‌షిప్‌కి భారత్ నుంచి 58 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, గతసారి భారత్ 27 పతకాలు గెలిచింది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నారు.

Next Story