WPL 2026 : 207 రన్స్ కొట్టినా కష్టంగానే గెలిచిన గుజరాత్.. టెన్షన్ పెట్టిన యూపీ బ్యాటర్ లిచ్‌ఫీల్డ్

by Harish |

WPL 2026 : 207 రన్స్ కొట్టినా కష్టంగానే గెలిచిన గుజరాత్.. టెన్షన్ పెట్టిన యూపీ బ్యాటర్ లిచ్‌ఫీల్డ్
X

దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూపీఎల్-2026‌లో గుజరాత్ జెయింట్స్ బోణీ కొట్టింది. యూపీ వారియర్స్‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే గెలుపు ఖాతా తెరిచింది. నవీ ముంబైలో శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెలుపు కోసం ఆ జట్టు కష్టపడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ శ్రమించక తప్పలేదు. కెప్టెన్ గార్డ్‌నెర్(65)‌లకుతోడు అనుష్క శర్మ(44), డివైన్(38) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి ముందు 208 పరుగుల భారీ టార్గెట్‌ పెట్టింది. అయితే, ఛేదనలో యూపీ గట్టిగానే పోరాడింది. ముఖ్యంగా లిచ్‌ఫీల్డ్(78) మెరుపు ఇన్నింగ్స్ ఆడి గుజరాత్‌ను టెన్షన్ పెట్టింది. అయితే, బౌలర్లు సమిష్టిగా రాణించి యూపీని 197/8 స్కోరుకే కట్టడి చేయడంతో గుజరాత్ విజయం సాధించింది.

మెరిసిన గార్డ్‌నెర్‌

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ జట్టులో కెప్టెన్ గార్డ్‌నెర్ సత్తాచాటింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన ఆమె ఫోర్లు, సిక్సర్లు దంచి హాఫ్ సెంచరీ చేసింది. మొత్తంగా 41 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఆమె తర్వాత అనుష్క శర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. 30 బంతుల్లో 44 రన్స్ చేసిన ఆమె తృటిలో అర్ధ శతకం చేజార్చుకుంది. ఓపెనర్ డివైన్(38), వారేహమ్(27 నాటౌట్) చిన్నపాటి మెరుపులు మెరిపించారు. మొత్తంగా గుజరాత్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు 207/4 స్కోరు చేసింది.

టెన్షన్ పెట్టిన లిచ్‌ఫీల్డ్

భారీ లక్ష్య ఛేదనలో యూపీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే(1) తొలి ఓవర్‌లోనే అవుటైంది. ఇక క్రీజులోకి వచ్చిన లిచ్‌ఫీల్డ్ సంచలన ప్రదర్శన చేసింది. జట్టును గెలిపించడానికి శక్తికి మించి పోరాడింది. అయితే, మరో ఎండ్‌లో గుజరాత్ బౌలర్లు హర్లీన్ డియోల్(0), దీప్తి శర్మ(1) వంటి కీలక ప్లేయర్లను తక్కువ స్కోరుకే అవుట్ చేసి దెబ్బకొట్టారు. కెప్టెన్ మెగ్ లాన్నింగ్(30), శ్వేత(25) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయరు. కానీ, లిచ్‌ఫీల్డ్ మాత్రం బెదరలేదు. ఎదురుదాడికి దిగిన ఆమె ఫోర్లు, సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను టెన్షన్ పెట్టింది. 40 బంతుల్లో 78 పరుగులు చేసిన ఆమె దూకుడుకు డివైన్ కళ్లెం వేయడంతో గుజరాత్‌ ఊపిరి పీల్చుకుంది. ఇక, ఆఖర్లో ఆశా శోభన(27 నాటౌట్) మెరిసినా యూపీని గెలిపించలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో రేణుక, డివైన్, వారేహమ్ చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.

Next Story