- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS ENG : గిల్ సెంచరీ.. రాణించిన జైశ్వాల్.. భారత్ స్కోరు ఎంతంటే?
తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది.

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ దిశగానే రెండో టెస్టును మెరుగ్గానే ఆరంభించింది. తొలి రోజు భారత్‌దే. కాస్త తడబడినప్పటికీ చివరికి పటిష్టమైన స్థితిలోనే నిలిచింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో బుధవారం భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 310 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్(114 బ్యాటింగ్) అజేయ శతకంతో కదం తొక్కడం, జైశ్వాల్(87) రాణించడంతో రెండో టెస్టులో భారత్ శుభారంభం చేసింది. గిల్‌తోపాటు జడేజా(41) క్రీజులో ఉన్నాడు.
మొదలుపెట్టిన జైశ్వాల్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. గత టెస్టులో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రెండు పరుగులకే అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతను ఆ తర్వాత గేర్ మార్చి దూకుడు పెంచాడు. బ్రైడెన్ కార్సే, జోష్ టంగ్‌లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు. మరో ఎండ్‌లో కరుణ్ నాయర్(31) తక్కువ స్కోరుకే అవుటైనా ఉన్నంత సేపు జైశ్వాల్‌కు సహకరించాడు. కరుణ్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే, స్టోక్స్ బౌలింగ్‌లో జైశ్వాల్ క్యాచ్ అవుటై తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
కొనసాగించిన గిల్
ఆ తర్వాత జైశ్వాల్ జోరును కెప్టెన్ గిల్ కొనసాగించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అయితే, తొలి టెస్టులో రెండు శతకాలు బాదిన రిషబ్ పంత్(25), తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్(1) స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో భారత్ 211/5తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గిల్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చాడు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమై జట్టును మరింత కష్టాల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. అతనికి రవీంద్ర జడేజా నుంచి చక్కటి సహకారం లభించింది. జడేజా కాస్త ధాటిగానే ఆడాడు. మరో వికెట్ పడితే ప్రత్యర్థికి పట్టుచిక్కే అవకాశాలు ఉండటంతో గిల్ సందర్భోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అడపాడదపా బౌండరీలు కొడుతూనే.. వికెట్లు మధ్య పరుగులు తీస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ క్రమంలో వరుసగా రెండో టెస్టులోనూ శతకాన్ని నమోదు చేశాడు. జడేజా, గిల్ వికెట్ కాపాడుకోవడంతో భారత్ తొలి రోజు 300 స్కోరును దాటి మెరుగైన స్థితిలో నిలిచింది.






