- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2026 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టనుంది. ఆ జట్టు ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఢిల్లీ టైటిల్ పోరుకు అర్హత సాధించడం వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. వడోదరలో మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయఢంకా మోగించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది. అయితే, 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. 15.4 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి విజయతీరాలకు చేరింది. గురువారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య టైటిల్ పోరు జరగనుంది. గత మూడు సీజన్లలోనూ ఫైనల్‌లో బోల్తా పడిన ఢిల్లీ ఈ సారైనా టైటిల్ కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.
రెచ్చిపోయిన ఢిల్లీ బ్యాటర్లు
169 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. వారి దూకుడు ముందు టార్గెట్ చాలా చిన్నదైపోయింది. ముందుగా ఓపెనర్లు లిజెల్లీ లీ(43), షఫాలీ వర్మ(31).. ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం అందించారు. లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ గుజరాత్ బౌలర్లను పరుగులు పెట్టించింది. షఫాలీ కూడా ధాటిగానే ఆడింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 రన్స్ జోడించారు. వీరిద్దరిని జార్జియా ఒకే ఓవర్‌లో అవుట్ చేసి ఢిల్లీ జోష్‌కు బ్రేక్ వేసింది. కానీ, అది ఎంతో సేపు లేదు. క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్ ఆ దూకుడును కొనసాగించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆమె 23 బంతుల్లో 41 రన్స్ చేసింది. ఆమెకు వొల్వార్డ్(32 నాటౌట్) సహకరించింది. వొల్వార్డ్‌తో కలిసి రోడ్రిగ్స్ జట్టును విజయానికి చేరువ చేసింది. గెలుపునకు మరో 9 రన్స్ దూరంలో రోడ్రిగ్స్ అవుటైనా.. వొల్వార్డ్, కాప్(4 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు.
మూనీ పోరాటం వృథా
అంతకుముందు గుజరాత్ జట్టు 168 రన్స్ చేసిందంటే ఓపెనర్ బెత్ మూనీనే కారణం. ఇతర బ్యాటర్లందరూ విఫలమైన వేళ ఆమె జట్టుకు అండగా నిలిచింది. ఢిల్లీ బౌలర్లు హెన్రీ 3 వికెట్లు, నందని శర్మ 2 వికెట్లతో విజృంభించడంతో గుజరాత్ తీవ్రంగా తడబడింది. డివైన్(6), గార్డ్‌నెర్(0) వంటి స్టార్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. అనుష్క(16), కనక(6), భార్తి ఫుల్మాలి(0) కూడా నిరాశపరిచారు. ఒకవైపు ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ విలవిలలాడిపోతుండగా.. బెత్ మూనీ జట్టును ఆదుకుంది. పోరాట పటిమ కనబర్చింది. ఓపెనర్‌గా వచ్చిన ఆమె చివరి వరకూ అజేయంగా నిలిచింది. 51 బంతుల్లో 62 పరుగులు చేసింది. ఆమె పోరాటంతో గుజరాత్ 168 పరుగులు చేసింది. అయితే బౌలర్లు లక్ష్యాన్ని కాపాడలేకపోవడంతో ఆమె పోరాటం వృథా అయ్యింది.






