India vs Pakistan: పాకిస్తాన్‌తో క్రికెట్ వద్దు.. ఐసీసీ టోర్నీల్లో కూడా ఆడకూడదు: గంభీర్

by Phanindra |

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ క్రికెట్ గురించి గౌతం గంభీర్ మాట్లాడాడు. పాక్‌తో ఐసీసీ ఈవెంట్స్‌లో కూడా ఆడకూడదన్నాడు.

India vs Pakistan: పాకిస్తాన్‌తో క్రికెట్ వద్దు.. ఐసీసీ టోర్నీల్లో కూడా ఆడకూడదు: గంభీర్
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌పై ఉగ్రదాడులు ఆగే వరకు పాకిస్తాన్‌తో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లో కూడా క్రికెట్ (India vs Pakistan) ఆడకూడదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీసులు ఆడబోమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంభీర్ కూడా తన అభిప్రాయం వెల్లడించాడు.

‘నన్నడిగితే వద్దనే చెప్తా. భారత్‌పై ఉగ్రదాడులు ఆగే వరకు భారత్-పాక్ మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఏదేమైనా మేం ఆడాలా? వద్దా? అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. నేను గతంలో కూడా చెప్పా.. క్రికెట్, బాలీవుడ్, మిగతా రంగాల్లో కూడా పాక్‌తో ఎలాంటి సంబంధం ఉండకూడదు. భారత జవాన్లు, ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు’ అని గంభీర్ స్పష్టం చేశాడు.

అదే సమయంలో ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తను గౌరవిస్తానని గంభీర్ చెప్పాడు. ‘నా చేతుల్లో ఏం లేదు కదా. ఈ నిర్ణయం బీసీసీఐ.. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా మేం సిద్ధంగా ఉండాలి. దాన్ని రాజకీయం చేయకూడదు’ అని పేర్కొన్నాడు.

కాగా, కొన్ని రోజుల క్రితం టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా పాక్‌తో క్రికెట్ (India vs Pakistan) ఆడటంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ ఆడతాయా? లేదా? అనేది అప్పుడే చెప్పలేమన్న గవాస్కర్.. ఆసియా కప్‌లో మాత్రం పాకిస్తాన్‌ ఆడేందుకు అనుమతి కూడా ఇవ్వకూడదన్నాడు.

Next Story