French Open : మట్టికోర్టులో చరిత్ర సృష్టించిన జకోవిచ్.. నదాల్ తర్వాత అతనే

by Harish |

25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు.

French Open : మట్టికోర్టులో చరిత్ర సృష్టించిన జకోవిచ్.. నదాల్ తర్వాత అతనే
X

దిశ, స్పోర్ట్స్ : 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అమెరికా ప్లేయర్ కామెరూన్ నూరీపై అలవోకగా నెగ్గాడు. మూడో సెట్లలోనే 6-2, 6-3, 6-2 తేడాతో మ్యాచ్‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గంటల 14 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో జకో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. జకో అనుభవం ముందు నూరీ నిలువలేకపోయాడు. తాజా విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో జకో అరుదైన రికార్డు నెలకొల్పాడు. మట్టి కోర్టులో అతనికి ఇది 100వ విజయం కావడం విశేషం.

ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు నదాల్(112) పేరిట ఉండగా రెండో ప్లేయర్ జకోనే. అలాగే, ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా 16వ సారి క్వార్టర్స్‌కు చేరుకోవడం గమనార్హం. 2016, 2021, 2023 సీజన్లలో జకో ఫ్రెంజ్ ఓపెన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.వరల్డ్ నం.3 ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా ముందంజ వేశాడు. నాలుగో రౌండ్‌లో అతను వాకోవర్ పొంది క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నెదర్లాండ్స్ ఆటగాడు గ్రీక్స్‌పూర్‌‌ పొత్తి కడుపు నొప్పితో ఆట మధ్యలోనే వైదొలిగాడు. తొలి సెట్‌ను 6-4తో నెగ్గిన జ్వెరెవ్ రెండో సెట్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో గ్రీక్స్‌పూర్ తప్పుకోవడంతో జ్వెరెవ్ తర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టాడు.

పెగులా ఔట్

ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.3 జెస్సికా పెగులా(అమెరికా) పోరాటం ముగిసింది. నాలుగో రౌండ్‌లో ఆమె 361వ ర్యాంకర్ బోయిసన్ చేతిలో ఓడింది. మూడు సెట్లలో ముగిసిన మ్యాచ్‌లో బోయిసన్ 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించింది. 40 ఏళ్లలో క్వార్టర్స్‌కు చేరుకున్న లోయెస్ట్ ర్యాంకర్‌గా ఆమె నిలిచింది. మరోవైపు, అమెరికా స్టార్ క్రీడాకారిణి కోకా గాఫ్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నాలుగో రౌండ్‌లో రష్యా ప్లేయర్ అలెగ్జాండ్రోవా‌ను 6-0, 7-5 తేడాతో ఓడించింది. మరో అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్, వరల్డ్ నం. ఆండ్రీవా కూడా నాలుగో రౌండ్‌ను దాటారు.


Next Story