- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2027 వరల్డ్ కప్ టీమ్‌లో రోహిత్ వద్దు: భారత మాజీ క్రికెటర్
వచ్చే నెలలో ఇంగ్లాండ్ జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే నెలలో ఇంగ్లాండ్ జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగానే రోహిత్‌ను ఎంపిక చేశారా? అంటూ ఆయన సెలెక్షన్ కమిటీని ప్రశ్నించారు. ఒక స్పోర్ట్స్ నెట్వర్క్ టాక్ షోలో పాల్గొన్న ఆయన.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
నా వ్యాఖ్యలు వివాదాస్పదం కావచ్చు: మంజ్రేకర్
"నేను చెప్పబోయేది ఖచ్చితంగా వివాదాస్పదంగా మారుతుంది. కానీ ఈ ఇన్నేళ్లలో నేను అలాంటి వాటి గురించి ఎప్పుడూ భయపడలేదు. పట్టించుకోలేదు కూడా. ప్రస్తుతం మనం 2026 మధ్యలో ఉన్నాం.. వన్డే ప్రపంచకప్ 2027 చివర్లో జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్ స్క్వాడ్‌లో రోహిత్ శర్మ నా ఛాయిస్ కాదు" అని మంజ్రేకర్ కుండబద్దలు కొట్టారు. వన్డేల్లో ఓపెనింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశం అని, అది ఆటగాడి ఫామ్‌ను నిలబెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం లాంటిదని మంజ్రేకర్ అభివర్ణించారు. "ఇలాంటి అరుదైన అవకాశాలను తమ కెరీర్ అత్యుత్తమ దశలో ఉండి, రాబోయే ఐదు నుండి పదేళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవ చేయగల యువ ఆటగాళ్లకు ఇవ్వాలి. మీరు కేవలం రోహిత్ శర్మ గురించి మాత్రమే ఆలోచించడం కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా సరే.. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి" అని ఆయన హితవు పలికారు.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతం..
ఇదే సమయంలో మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీపై మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. కోహ్లీ తన అసాధారణ ఫిట్‌నెస్‌తో 2027 ప్రపంచకప్ రేస్‌లో బలమైన దావా వేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. అయితే, జట్టు ఎంపిక అనేది విరాట్, రోహిత్ లేదా బుమ్రా వంటి పెద్ద పేర్లను చూసి కాకుండా.. కేవలం టీమిండియా ప్రయోజనాలకు ఏది అవసరమో దాని ఆధారంగానే జరగాలని స్పష్టం చేశారు. ఇటీవల వన్డేల్లో అద్భుతంగా రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టి, రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై మంజ్రేకర్ ఈ విధమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి రాబోయే రోజుల్లో 2027 వరల్డ్ కప్ రోడ్ మ్యాప్‌పై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.






