భారత్‌తో పెట్టుకోవద్దు.. మిగతా జట్లు కూడా రావు :పాక్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చిన పీసీబీ మాజీ చైర్మన్

by Harish |   ( Updated:2024-07-21 14:22:34.0  )
భారత్‌తో పెట్టుకోవద్దు.. మిగతా జట్లు కూడా రావు :పాక్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చిన పీసీబీ మాజీ చైర్మన్
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ‌లో టీమ్ ఇండియా పాల్గొనడంపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించలేమని బీసీసీఐ చెబుతున్నది. మరోవైపు, టీమిండియా పాక్‌కు రాకపోతే భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తాము పాల్గొనమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీకి తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనిపై పీసీబీ మాజీ చైర్మన్ ఖలీద్ మహమూద్ పాక్ బోర్డును హెచ్చరించాడు. భారత్ ముందు టిట్ ఫర్ టాట్ వ్యూహం పనిచేయదని, అలాంటి వాటితో పాక్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించాడు.

భారత జట్టు రాకపోతే శ్రీలంక, అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లు కూడా టోర్నీని బహిష్కరించే ప్రమాదం ఉందన్నాడు. ‘పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత్ అంగీకరించడానికి చాలా తక్కువ చాన్స్‌లు ఉన్నాయి. భారత్ రిచెస్ట్ క్రికెట్ బోర్డును కలిగి ఉంది. అలాగే, చాలా పలుకుబడి ఉంది. వారు తమ జట్టును పాక్‌కు పంపించకపోతే.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా అదే దారిలో పయనిస్తాయనుకుంటున్నా. కాబట్టి, మీకు ఒక్కటే దారి ఉంది. మిగతా బోర్డులను బుజ్జగించి మీ వైపు తెచ్చుకోండి. ఐసీసీలో భారత్‌కు చాలా ప్రాబల్యం ఉంది. కాబట్టి, టిట్ ఫర్ టాట్ వ్యూహం పాక్‌కు మంచి కాదు.’అని తెలిపాడు. ఆసియా కప్ తరహాలో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story