ఇండియా వరల్డ్ కప్‌ గెలిస్తే ఏంటి?.. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అక్కసు..

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఇండియా వరల్డ్ కప్‌ గెలిస్తే ఏంటి?.. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అక్కసు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ గెలుపుపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టోర్నీ ఆరంభం నుండి భారత్ ఓడిపోతుందని జోస్యం చెబుతూ వచ్చిన అమీర్, తన అంచనా తప్పడంతో అసహనానికి గురయ్యారు.

అడిగితే కోపం.. అమీర్ వింత స్పందన

ఫైనల్‌లో బ్లాక్‌క్యాప్స్ (న్యూజిలాండ్) గెలుస్తుందని అమీర్ గట్టిగా నమ్మారు. భారత్ విజయం తర్వాత ఒక పోస్ట్-మ్యాచ్ షోలో దీనిపై అమీర్‌ను ప్రశ్నించగా, ఆయన వింతగా స్పందించారు. "వారు గెలిచారు, అది సరే.. కప్పును వాళ్ల ఇంటికి తీసుకెళ్తారు, నా ఇంటికి తీసుకురారు కదా? వెల్ డన్.." అంటూ పొడిపొడిగా, అసహనంతో సమాధానమిచ్చారు. అయితే గతంలో సూపర్-8 దశలో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోతుందని అమీర్ సరిగ్గా ఊహించారు. అప్పటి నుండి భారత్ ఫైనల్ చేరదని, ఒకవేళ చేరినా కప్పు గెలవదని వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహమ్మద్ కైఫ్ వంటి మాజీ భారత క్రికెటర్లు కూడా అమీర్‌ను గతంలోనే తప్పుబట్టారు.

"న్యూజిలాండ్ బౌలర్ల వల్లే భారత్ గెలిచింది"

భారత్ ప్రతిభ కంటే న్యూజిలాండ్ బౌలర్ల వైఫల్యం వల్లే ఈ విజయం సాధ్యమైందని అమీర్ విశ్లేషించారు. 'హార్నా మానా హై' అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మకు కలిసొచ్చింది. అభిషేక్ శర్మ ఆఫ్-స్పిన్‌కు తడబడతాడని తెలిసినా, సాంట్నర్ ఎందుకు స్పిన్‌ను కొనసాగించలేదో అర్థం కాలేదు. డఫీని తీసుకురావడం వింత వ్యూహం అని విమర్శించారు. లోకీ ఫెర్గూసన్ వంటి బౌలర్ కూడా వైడ్లు వేస్తూ, స్లాట్ బంతులు వేసి సిక్సర్లు కొట్టించుకోవడం చూస్తుంటే న్యూజిలాండ్ ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోంది. హెన్రీ బాగా బౌలింగ్ చేస్తున్నా ప్లాన్ మార్చడం ఆశ్చర్యకరం. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు కూడా ఒత్తిడిలో ఉన్నా, భారత్ తన మానసిక ధృడత్వాన్ని (Mental Strength) చాటుకుంది. అందుకే వారు ఫైనల్ గెలిచారు" అని అమీర్ అభిప్రాయపడ్డారు.

Next Story