21ఏళ్లలో తొలిసారిగా.. చారిత్రాత్మిక విజయానికి అడుగు దూరంలో అనాహత్

by Harish |

భారత స్క్వాష్ స్టార్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

21ఏళ్లలో తొలిసారిగా.. చారిత్రాత్మిక విజయానికి అడుగు దూరంలో అనాహత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్క్వాష్ స్టార్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరల్డ్ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలవడానికి ఆమెకు కావాల్సింది ఒక్క విజయం మాత్రమే. కెనడాలో జరుగుతున్న ఈ టోర్నీలో అనాహత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో ఈజిఫ్ట్‌కు చెందిన బార్బ్ సమెను ఓడించింది. దీంతో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 21 ఏళ్ల తర్వాత ఓ భారత ప్లేయర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అనాహత్ కంటే ముందు జోష్న చిన్నప్ప 2005‌లో ఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆమె ఓడిపోయింది. ఇప్పుడు అనాహత్ విజేతగా నిలిస్తే వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుకెక్కుతుంది.

ప్రస్తుత టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న అనాహత్ సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఈజిఫ్ట్ క్రీడాకారిణి బార్బ్ సమె‌పై 3-1 తేడాతో గెలిచింది. తొలి గేమును 11-3తో గెలిచిన ఆమెకు రెండో గేములో ప్రత్యర్థి గెలిచి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అనాహత్ బలంగా పుంజుకుని దూకుడు పెంచింది. వరుసగా 3, 4 గేములను 11-4, 11-6 తేడాతో నెగ్గి ఫైనల్‌లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో అనాహత్ ఈజిఫ్ట్‌కే చెందిన రుఖయ్యా సలేంతో తలడపనుంది.

Next Story