- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి అదరగొట్టింది. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ ఏడాది జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. 13 రౌండ్లు ముగిసే సరికి వైశాలి 7.5 పాయింట్లతో కజకస్థాన్‌కు చెందిని బిబిసారా అస్సౌబయేవాతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలవాలంటే ఆఖరి రౌండైన 14వ రౌండ్‌లో వైశాలి గెలవాలి.
తప్పక గెలవాల్సిన 14వ రౌండ్‌లో ఆమె సత్తాచాటింది. ఉక్రెయిన్‌కు చెందిన కాటేరినా లగ్నోను ఓడించింది. 48 ఎత్తుల్లో వైశాలి పైచేయి సాధించి 8.5 పాయింట్స్‌తో విజేతగా నిలిచింది. వైశాలికి మరో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ కూడా ఓ రకంగా సహాయం చేసింది. బిబిసారా అస్సౌబయేవాతో తలపడిన దివ్య 14వ రౌండ్‌ను డ్రా చేసుకుంది. ఒకవేళ దివ్యపై బిబిసారా గెలిచి ఉంటే ఆమె, వైశాలి స్కోర్లు సమం అయ్యేవి. అప్పుడు విజేత కోసం టై బ్రేకర్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ, డ్రా అవ్వడంతో బిబిసారా 8.0 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. దివ్య 5.5 పాయింట్లతో 7వ స్థానంతో సరిపెట్టింది. ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో వైశాలి.. చైనాకు చెందిన జు వెంజున్‌తో పోటీపడనుంది.






