సారీ.. సంజూ.. అన్యాయం అయిపోతున్నావ్!

by Phanindra |

టీ20ల్లో ఓపెనర్‌గా అదరగొట్టిన సంజూ శాంసన్. గిల్ కోసం లోయర్ ఆర్డర్‌కు డిమోట్ చేసిన టీం మేనేజ్‌మెంట్. ఇప్పుడు టీంలోనే లేకుండా..

సారీ.. సంజూ.. అన్యాయం అయిపోతున్నావ్!
X

దిశ, స్పోర్ట్స్: వరుస పెట్టి మూడు సెంచరీలు బాదిన ప్లేయర్‌ను ఎవరూ వదులుకోరు. దానికితోడు దేశవాళీల్లో కూడా రాణిస్తుంటే.. అతను టీమిండియాకు రెగ్యులర్ ప్లేయర్ అవడంలో ఆశ్చర్యమే ఉండదు. కానీ అన్ని చేసినా కూడా ఒక ప్లేయర్ బెంచ్‌కే పరిమితమైతే? దాన్ని దురదృష్టం అనాలా? లేక టీం రాజకీయాలు అనాలా? ఇప్పుడు క్రికెట్ అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. సౌతాఫ్రికాతో తొలి టీ20లో సంజూ శాంసన్‌ను కాదని జితేశ్ శర్మను తీసుకోవడంతో ఈ చర్చ మరింత పెద్దదయింది. టీ20ల్లో ఓపెనర్‌గా సంజూ ఇరగదీస్తున్న సమయంలో.. పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంచిన శుభ్‌మన్ గిల్‌ను సడెన్‌గా రంగంలోకి దించారు.

మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఆలోచనతోనే ఇలా చేసినా.. గిల్ కోసం సంజూను ఓపెనర్‌గా తొలగించడంపై దుమారం రేగింది. దానికితోడు గిల్ వరుసగా విఫలమవుతున్నాడు కూడా. గిల్ వచ్చినా ఓపెనర్‌గా ఆడిన సంజూను టాపార్డర్‌లోనే ఉంచుతారని అంతా అనుకున్నారు. కానీ అతన్ని 6 నుంచి 8వ స్థానంలో ఇష్టమొచ్చిన చోట పంపడం మొదలు పెట్టారు. అయినా తనకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. ఫైర్ బ్రాండ్ క్రికెట్ ఆడేందుకే సంజూ ప్రయత్నిస్తూ వచ్చాడు.

జితేశ్ ఎంట్రీ..

ఇలాంటి సమయంలో ఐపీఎల్ మెరుపుల కారణంగా జితేశ్ శర్మ టీమిండియాలోకి వచ్చాడు. సాధారణంగానే లోయర్ ఆర్డర్ ప్లేయర్ అయిన జితేశ్‌ను తీసుకోవడంతో.. సంజూనే రిప్లేస్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. చివరకు అదే నిజమైంది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా సంజూ అద్భుతంగా ఆడాడు. నాలుగు అర్ధశతకాలు సాధించాడు. అదే సమయంలో జితేశ్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అయితే సంజూ ఓపెనర్‌గా ఆడగా.. జితేశ్ ఫినిషర్‌గా ఆడటం గమనార్హం. ఇలా ఓపెనర్‌ స్పాట్ తనలో బెస్ట్‌ ప్లేయర్‌ను చూపిస్తుందని సంజూ పరోక్షంగా సంకేతాలు పంపాడు. అందుకేనేమో? అతన్ని అసలు జట్టులో నుంచి తప్పించేసి జితేశ్‌ను ఆడిస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గంభీర్ రాజకీయాలా?

హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఒక ఎజెండా ప్రకారమే సంజూనే పక్కన పెట్టేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. టాపార్డర్‌లో తన మాట వినే గిల్, సూర్యను తప్పించడం ఇష్టం లేక.. సంజూ కనుక జట్టులో ఉండి రాణిస్తే, అతన్ని కచ్చితంగా ప్రమోట్ చేయాల్సి వస్తుందనే ఆలోచనతోనే శాంసన్‌ను తప్పిస్తున్నాడనేది వారి వాదన. తిలక్ వర్మకు కూడా దాదాపు ఒక స్థానం ఫిక్స్ చేసిన గంభీర్.. కావాలనే సంజూ ఉన్నా కూడా అక్షర్, వాషింగ్టన్ వంటి ప్లేయర్లను ముందుగా బ్యాటింగ్‌కు పంపిన సందర్భాలున్నాయి. ఇదంతా చూసిన వారికి అనుమానాలు రావడం సహజం. టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే మన బెస్ట్ టీంతో ఆడాలి కానీ.. రాజకీయాల కోసం జట్టును నాశనం చేసుకోకూడదని పలువురు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు కూడా. సంజూ వంటి నాణ్యమైన ప్లేయర్ విషయంలో ఇంత అన్యాయం జరుగుతుండటంతో.. ‘సారీ.. సంజూ. నీకు తగ్గ గౌరవం దక్కడం లేదు’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Next Story