ఛాంపియన్స్ లీగ్ పోరు.. చివరి నిమిషంలో హావెర్ట్‌జ్‌ పెనాల్టీ గోల్‌తో 1-1 డ్రా

by Ramesh Naini |

ఛాంపియన్స్ లీగ్ రౌండ్ ఆఫ్-16 (లాస్ట్-16) తొలి లీగ్ మ్యాచ్‌లో బేయర్ లేవర్‌కుసెన్, ఆర్సెనల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో 1-1 స్కోరుతో డ్రాగా ముగిసింది.

ఛాంపియన్స్ లీగ్ పోరు.. చివరి నిమిషంలో హావెర్ట్‌జ్‌ పెనాల్టీ గోల్‌తో 1-1 డ్రా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛాంపియన్స్ లీగ్ రౌండ్ ఆఫ్-16 (లాస్ట్-16) తొలి లీగ్ మ్యాచ్‌లో బేయర్ లేవర్‌కుసెన్ (Bayer Leverkusen), ఆర్సెనల్ (Arsenal) జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో 1-1 స్కోరుతో డ్రాగా ముగిసింది. బుధవారం లేవర్‌కుసెన్ సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సెనల్ జట్టు ఓటమి అంచుల్లో నిలవగా.. 89వ నిమిషంలో కాయ్ హావెర్ట్‌జ్‌ (Kai Havertz) సాధించిన పెనాల్టీ గోల్ ఆ జట్టును కాపాడింది. లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆర్సెనల్, ఈ మ్యాచ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చాయి. 19వ నిమిషంలో ఆర్సెనల్ ఆటగాడు గ్యాబ్రియెల్ మార్టినెల్లీ కొట్టిన బంతి క్రాస్ బార్‌కు తగిలి వెనక్కి రావడం గమనార్హం.

చివరి నిమిషంలో పెనాల్టీ

సెకండ్ ఆఫ్‌ ప్రారంభమైన వెంటనే (46వ నిమిషాల్లో) లేవర్‌కుసెన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గ్రిమాల్డో తీసిన కార్నర్‌ కిక్ సాయంతో రాబర్ట్ ఆండ్రిచ్ అద్భుతమైన హెడర్‌తో గోల్ చేశాడు. మ్యాచ్ ముగిసే సమయంలో ఆర్సెనల్ ఆటగాడు నోని మదుయేకేను లేవర్‌కుసెన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మాలిక్ టిల్మాన్ పెనాల్టీ బాక్స్‌లో ఫౌల్ చేశాడు. దీంతో రిఫరీ ఆర్సెనల్‌కు పెనాల్టీ అవకాశం ఇచ్చాడు. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన కై హావెర్ట్‌జ్‌ 89వ నిమిషంలో ఎటువంటి తడబాటు లేకుండా బంతిని వలపట్టించి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సెనల్ ఫ్రీ-కిక్ వ్యూహాలపై ముందు నుంచే అసంతృప్తిగా ఉన్న లేవర్‌కుసెన్ మేనేజర్ కాస్పర్ హ్యుల్మాండ్.. గోల్ అనంతరం ఆర్సెనల్ సెట్-పీస్ కోచ్ నికోలస్ జోవర్‌తో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తత రేపింది.

వచ్చే వారం రెండో అంచె పోరు

వచ్చే మంగళవారం లండన్‌లోని ఎమిరేట్స్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో అంచె (రిటర్న్ లెగ్) మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాలంటే ఆ మ్యాచ్‌లో ఆర్సెనల్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు, 2002లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత మళ్లీ క్వార్టర్స్ చేరాలని లేవర్‌కుసెన్ సిద్దపడుతోంది.

Next Story