- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీ పాయింట్స్‌పై ప్రభావం
మూడో టెస్టులో విజయంతో ఆనందంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : మూడో టెస్టులో విజయంతో ఆనందంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఆ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్స్(డబ్ల్యూటీసీ) పాయింట్స్‌లో రెండు పాయింట్లు కోత పెట్టింది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. తక్కువ వేసిన ప్రతి ఓవర్‌కు జట్టులోని ఆటగాళ్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానాగా విధించబడుతుంది. అలాగే, ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ నిబంధనల్లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. తక్కువ వేసిన ప్రతి ఓవర్‌కు ఒక్క పాయింట్ కోత పడుతుంది. ఇంగ్లాండ్ రెండు ఓవర్లు తక్కువగా వేసినట్టు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్లో ఓవర్ రేట్ రూల్‌ను ఉల్లంఘించినట్టు అంగీకరించాడని ఐసీసీ తెలిపింది. రెండు పాయింట్లు కోత పెట్టడం ఇంగ్లాండ్‌పై భారీ ప్రభావాన్ని చూపింది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. మూడో టెస్టు విజయంతో ఆ జట్టు 24 పాయింట్లతో 66.67 పర్సెంటేజ్‌తో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా ఐసీసీ చర్యతో ఇప్పుడు 22 పాయింట్లతో 61.11 శాతంతో మూడో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా 36 పాయింట్స్, 100 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక(16 పాయింట్స్, 66.67 శాతం), భారత్(12 పాయింట్స్, 33.33 శాతం) రెండు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.






