ENG-W vs IND-W : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ ఓటమి.. 5 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ విక్టరీ

by Harish |

టీ20 సిరీస్‌లో భారత్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తయిన ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు పుంజుకుంది.

ENG-W vs IND-W : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ ఓటమి.. 5 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్‌లో భారత్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తయిన ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు పుంజుకుంది. మూడో టీ20లో నెగ్గి సిరీస్ ఆశలను కాపాడుకుంది. లండన్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుపై అతికష్టం మీద 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 స్కోరు చేసింది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సోఫియా డంక్లీ(75), వ్యాట్ హోడ్జ్(66)లు మాత్రమే రాణించారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు బాది తొలి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, డెత్ ఓవర్లలో భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ దూకుడుకు చెక్ పెట్టారు. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి‌లకుతోడు దీప్తి శర్మ వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఓపెనర్ల తర్వాత మిగతా వారిలో ముగ్గురు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి, దీప్తి చెరో 3 వికెట్లు తీయగా.. శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి.

అయితే, 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ పోరాడినా ఫలితం దక్కలేదు. 20 ఓవర్లలో 166/5 స్కోరుకే పరిమితమైంది. స్మృతి మంధాన(56) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఆమెకుతోడు షెఫాలీ వర్మ(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ఒక దశలో భారత్ 123/2 మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ, వారి జోరును రోడ్రిగ్స్(20), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(23), రిచా ఘోష్(7) కొనసాగించలేకపోయారు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 12 రన్స్ కావాల్సి ఉండగా 8 పరుగులే రావడంతో ఓటమి తప్పలేదు. అయినప్పటికీ సిరీస్‌లో టీమిండియానే 2-1తో ఆధిక్యంలో ఉంది. బుధవారం నాలుగో టీ20 జరగనుంది.


Next Story