IND VS WI : నేటి నుంచి రెండో టెస్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను

by Harish |

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్నేసింది.

IND VS WI : నేటి నుంచి రెండో టెస్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్‌పై టీమ్ ఇండియా కన్నేసింది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. తొలి టెస్టు విజయంతో గిల్ సేన జోరు మీద ఉన్నది. నేటి నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఢిల్లీ టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తున్నది. ఓడితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. డ్రా చేసుకున్నా సిరీస్ దక్కుతుంది. కానీ, సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా న్యూజిలాండ్ చేతిలో ఓటమికి కాస్తయినా మందు రాసినట్టు అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా భారత్ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ స్టేడియం భారత్‌కు కంచుకోట. 38 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడలేదు. ఆ అంశం కూడా భారత్‌ జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. విన్నింగ్ జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మళ్లీ ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే

తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతోనే భారీ విజయం సాధ్యమైంది. రెండో టెస్టులోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు శతకాలు నమోదయ్యాయి. రాహుల్, ధ్రువ్ జురెల్, జడేజా శతకాలు బాదారు. గిల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ఇచ్చింది. రెండో టెస్టులోనూ వారు అదే దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వాళ్లకుతోడు పెద్దగా ఆకట్టుకోని యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి టెస్టులో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్ కూడా 4 ఓవర్లే వేశాడు. అతన్ని నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. కాబట్టి, రెండో టెస్టులో అతను ఆల్‌రౌండ్ షో చేయాలి. ఇక, బౌలింగ్‌లో సిరాజ్, జడేజా, కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించారు. బుమ్రా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసినా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోవడం కాస్త నిరాశపర్చింది. రెండో టెస్టులో అతని విశ్వరూపం చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

భారత్‌కు ఢిల్లీ కంచుకోట

ఢిల్లీ స్టేడియం భారత్‌కు కంచుకోటగా చెప్పుకోవచ్చు. 1987 తర్వాత టెస్టుల్లో ఆ స్టేడియంలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 13 మ్యాచ్‌లు ఆడితే అందుల్లో 11 మ్యాచ్‌ల్లో గెలవడం విశేషం. మరో రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. 2011లో ఈ స్టేడియంలో చివరిసారిగా భారత్, విండీస్ తలపడ్డాయి. అప్పుడు టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

పిచ్ రిపోర్టు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కూడా ఇతర భారత స్టేడియాల్లాగే ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుంది. అయితే, తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించొచ్చు. మూడో రోజు నుంచి బంతి టర్న్ అవ్వనున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. చివరి రోజు బ్యాటింగ్ కష్టతరమని చెప్పాయి. గత మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే.. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. 14 మ్యాచ్‌ల్లో మొదట బౌలింగ్ ఎంచుకున్న జట్లు గెలిచాయి.

తుది జట్లు(అంచనా)

భారత్ : యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్ : చందర్‌పౌల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాజె, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్/జెడియా బ్లేడ్స్, జైడెన్ సీల్స్

Next Story