US Open : సెమీస్‌లో జకో ఔట్.. వచ్చే సీజన్ ఆడతాడా?

by Harish |

దశాబ్దానికిపైగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో ఉన్నాడు.

US Open : సెమీస్‌లో జకో ఔట్.. వచ్చే సీజన్ ఆడతాడా?
X

దిశ, స్పోర్ట్స్ : దశాబ్దానికిపైగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు(24 గ్రాండ్‌స్లామ్‌లు) నెగ్గిన రికార్డు అతని పేరిటే ఉంది. మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గితే పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. అయితే, ఆ రికార్డు జకోకు అందని ద్రాక్షగానే మారింది. 2023లో చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ నెగ్గిన అతనికి ఈ సీజన్‌లోనూ నిరాశ తప్పలేదు. యూఎస్ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శననే చేసినప్పటికీ సెమీస్‌లో అల్కరాజ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో వరుసగా రెండో సీజన్‌లోనూ అతను ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేకపోయాడు.

నాలుగు పదులకు చేరువ అవుతున్న జకో వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జకో వచ్చే సీజన్ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు వచ్చే సీజన్ ఆడాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామంటూ సస్పెన్స్ కొనసాగించాడు ‘వచ్చే ఏడాది పూర్తి గ్రాండ్‌స్లామ్ సీజన్ ఆడాలి ఉంది. ఇతర టోర్నీల కంటే గ్రాండ్‌స్లామ్‌లు భిన్నమైనవి. క్రీడకు అవి పిల్లర్లలాంటివి.’అని చెప్పాడు. ప్రస్తుతం తన ఆటపై సంతృప్తిగానే ఉన్నట్టు జకో చెప్పాడు. దురదృష్టవశాత్తూ తన కెరీర్‌ను నియంత్రించుకోలేకపోతున్నానని గాయాలను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. తాను పోరాటాన్ని కొనసాగిస్తానని, కనీసం మరో గ్రాండ్‌‌స్లామ్ కోసమైనా పోరాడతానని చెప్పాడు.


Next Story