గోల్ఫ్ ప్రపంచంలో తీవ్ర విషాదం: భారత స్టార్ గోల్ఫర్ విజయ్ కుమార్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-29 12:19:26  IST  )

భారత వెటరన్ గోల్ఫర్, 2002 ఇండియన్ ఓపెన్ విజేత విజయ్ కుమార్ (60) ఇవాళ గుండెపోటుతో లక్నోలో తుదిశ్వాస విడిచారు.

గోల్ఫ్ ప్రపంచంలో తీవ్ర విషాదం: భారత స్టార్ గోల్ఫర్ విజయ్ కుమార్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత గోల్ఫ్ (Golf) రంగం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెటరన్ గోల్ఫ్ క్రీడాకారుడు విజయ్ కుమార్ (Vijay Kumar) కన్నుమూశారు. 60 ఏళ్ల వయసు ఉన్న ఆయన ఇవాళ లక్నో (Lucknow)లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దేశీయ గోల్ఫ్ సర్క్యూట్‌లో అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకరిగా పేరుగాంచిన విజయ్ కుమార్ మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇవాళ ఉదయం విజయ్ కుమార్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లక్నోలోని ఓ స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు.

విజయవంతమైన క్రీడా ప్రస్థానం..

లక్నో గోల్ఫ్ క్లబ్‌తో దశాబ్దాల అనుబంధం ఉన్న విజయ్ కుమార్ తన మొత్తం కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నారు. 2002లో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఓపెన్’ టైటిల్‌ను గెలుచుకుని భారత గోల్ఫ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇండియన్ టూర్ (PGTI)లో దాదాపు 50కి పైగా టైటిళ్లను గెలుచుకున్న ఘనత ఆయనదే. 1990వ దశకం చివరలో, 2000 ప్రారంభంలో భారత దేశవాళీ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో చాలాకాలం పాటు ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగారు. గోల్ఫ్ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. అయితే, విజయ్ కుమార్ మరణం పట్ల తోటి గోల్ఫ్ క్రీడాకారులు జీవ్ మిల్కా సింగ్, శివ్ కపూర్, అర్జున్ అత్వాల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Next Story