క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ఆఫ్గానిస్తాన్ కీలక ఫాస్ట్ బౌలర్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-07 09:50:01  IST  )

ఆఫ్గానిస్తాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలో కన్నుమూశారు.

క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ఆఫ్గానిస్తాన్ కీలక ఫాస్ట్ బౌలర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ఓ అరుదైన వ్యాధితో పోరుడుతూ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఇవాళ మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, ఈ వార్త అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, గతేడాది అక్టోబర్‌లో స్వదేశంలో మొదటిసారి అనారోగ్యానికి గురైన జద్రాన్, ఈ ఏడాది జనవరి నుంచి న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూ (ICU)లో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఆయన సోదరుడు ఘమాయి జద్రాన్‌తో పాటు, ఆఫ్ఘన్ మాజీ జాతీయ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ కూడా ఆయనతోనే ఉన్నారు.

ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సంతాపం..

అయితే, జద్రాన్ మృతి పట్ల ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘తీవ్రమైన దుఃఖంతో, శోకతప్త హృదయంతో మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ మరణాన్ని మేము ధృవీకరిస్తున్నాం’ అని ఏసీబీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పునాదిని నిర్మించిన కీలక వ్యక్తులలో షాపూర్ ఒకరు. ఆయన అంకితభావం, పట్టుదల, ఆట పట్ల ఉన్న నిబద్ధత దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆఫ్గాన్ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ప్రారంభ ప్రయాణంలో ఆయన ఓ గర్వించదగ్గ క్రికెటర్‌గా నిలిచారు’ అని ఏసీబీ కొనియాడింది. ఈ ఎడమచేతి వాటం పేసర్ షాపూర్ జద్రాన్ ‘హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతకమైన రోగనిరోధక శక్తి లోపంతో (Immune disorder) బాధపడుతున్నారు. ఇందులో రోగనిరోధక కణాలు స్వయంగా శరీరంలోని సొంత అవయవాలపైనే దాడి చేస్తాయి. దీనికి తోడు ఆయన రోగనిరోధక వ్యవస్థ క్షీణించడంతో శరీరం అంతటా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇవాళ తుది శ్వాస విడిచారు.

Next Story