WPL 2025 : ముంబై జోరుకు బ్రేక్.. భారీ విజయం సాధించిన ఢిల్లీ

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జోరుకు బ్రేక్ పడింది.

WPL 2025 : ముంబై జోరుకు బ్రేక్.. భారీ విజయం సాధించిన ఢిల్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉన్న ఆ జట్టుకు ఢిల్లీ క్యాపిట్సల్స్ కళ్లెం వేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబైని చిత్తు చేసింది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 123/9 స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(22), హేలీ మాథ్యూస్(22) టాప్ స్కోర్లర్లు. ఢిల్లీ బౌలర్లు మిన్ను మణి (3/17), జొనాస్సెన్ (3/25) ముంబైని స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కెప్టెన్ మెగ్ లాన్నింగ్(60 నాటౌట్), షెఫాలీ వర్మ(43) చెలరేగడంతో ఢిల్లీ 124 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి ఛేదించింది.

ముంబై విలవిల

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైని ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్లు మిన్ను మణి, జొనాస్సెన్ ధాటికి ఆ జట్టు విలవిలలాడిపోయింది. ముంబై జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్(22), హేలీ మాథ్యూస్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారంటే ఆ జట్టు ఏ విధంగా తడబడిందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. 35 రన్స్‌కే ఓపెనర్లు యాస్తికా భాటియా(11), మాథ్యూస్ వికెట్లు పారేసుకోగా.. ఆ తర్వాత నాట్ స్కివర్ బ్రంట్(18)తో కలిసి కెప్టెన్ హర్మన్‌ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ, వీరిద్దరిని జొనాస్సెన్ వరుస ఓవర్లలో అవుట్ చేసి దెబ్బకొట్టింది. ఆ తర్వాత అమేలియా కెర్(17), అమన్‌జోత్ కౌర్(17), సజన(5) అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా.. ముంబై కష్టంగా 123 రన్స్ చేసింది.

మెగ్ లాన్నింగ్, షెఫాలీ మెరుపులు

ఛేదనలో ఢిల్లీ ఏమాత్రం తడబడలేదు. కెప్టెన్ మెగ్ లాన్నింగ్, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌కు ధాటిగా ఆరంభించారు. ఒక ఎండ్‌లో షెఫాలీ ఫోర్లు, సిక్స్‌లు దంచగా.. మరో ఎండ్‌లో లాన్నింగ్ ఫోర్లు దంచింది. వీరిద్దరు మెరుపులతో జట్టుకు అదరిపోయే ఆరంభించారు.తొలి వికెట్‌కు ఈ జోడీ 85 రన్స్ చేసింది. వీరే జట్టు విజయాన్ని లాంఛనం చేసేలా కనిపించారు. కానీ, అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో షెఫాలీ అవుటై తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. షెఫాలీ అవుటైనా.. రోడ్రిగ్స్(15 నాటౌట్)తో కలిసి మెగ్ లాన్నింగ్ మిగతా పని పూర్తి చేసింది.

Next Story