WPL 2025 : ఢిల్లీ జోరుకు బ్రేక్.. హ్యాట్రిక్ కొట్టిన గుజరాత్

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ దూకుడు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది.

WPL 2025 : ఢిల్లీ జోరుకు బ్రేక్.. హ్యాట్రిక్ కొట్టిన గుజరాత్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ దూకుడు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. అంతేకాకుండా వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్ వేసింది. శుక్రవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 177/5 స్కోరు చేసింది. కెప్టెన్ లాన్నింగ్(92) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. షెఫాలీ వర్మ(40) కూడా రాణించింది. గుజరాత్ బౌలర్లు మేఘ్న(3/35),డెయాండ్రా డాటిన్(2/37) సత్తాచాటి ఢిల్లీని 200లోపే కట్టడి చేశారు. అనంతరం గుజరాత్ 178 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్లీన్(70 నాటౌట్) చివరి వరకూ అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బెత్ మూనీ(44) కూడా మెరిచింది. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. గుజరాత్ గెలుపుతో యూపీ వారియర్స్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి.

మెరిసిన హర్లీన్ డియోల్

బ్యాటింగ్‌లో ఢిల్లీకి శుభారంభం దక్కితే.. ఛేదనలో గుజరాత్‌‌ పేలవంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్ హేమలత(1) దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత బెత్ మూనీ, హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ నిర్మించారు. దూకుడుగా ఆడిన వీరు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును వేగంగా నడిపించారు. ఈ క్రమంలో హర్లీన్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడింది. బెత్ మూనీతో కలిసి 85 రన్స్ జోడించింది. బెత్ మూనీ అవుటైన తర్వాత కూడా హర్లీన్ తన జోరును కొనసాగించింది. గార్డ్‌నెర్(22), డెయాండ్రా డాటిన్(24) తక్కువ సేపే క్రీజులో ఉన్నా విలువైన రన్స్ జోడించారు. వీరిద్దరితో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన హర్లీన్ చివరి వరకూ నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చింది.

చెలరేగిన లాన్నింగ్

ముందుగా ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. కెప్టెన్ లాన్నింగ్ తన ఫామ్‌‌ను కొనసాగిస్తూ జట్టుకు బలమైన పునాది వేసింది. తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా మెరిచింది. వీరిద్దరూ గుజరాత్ బౌలింగ్‌లో రెచ్చిపోయారు. లాన్నింగ్ ఎడాపెడా ఫోర్లు దంచగా.. షెఫాలీ సిక్సర్లతో అలరించింది. దీంతో 8 ఓవర్లలో ఢిల్లీ వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చేయడంతో స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే, గుజరాత్ బౌలర్లు ఆలస్యంగా పుంజుకున్నారు. మేఘ్న సింగ్ వరుసగా వికెట్లు తీసింది. షెఫాలీని అవుట్ చేసి ఓపెనింగ్ జోడీని విడదీసింది. కాసేపటికే జొనాస్సెన్(9)ను డెయాండ్రా డాటిన్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో రోడ్రిగ్స్(4), సదర్లాండ్(14)లను మేఘ్న పెవిలియన్ పంపడంతో ఢిల్లీ తడబాటుకు గురైంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లాన్నింగ్ మాత్రం దూకుడును ఆపలేదు. ఢిల్లీ 177 స్కోరు చేసిందంటే ఆమె ఒంటరి పోరాటమే కారణం. ఆఖరి ఓవర్‌లో డెయాండ్రా డాటిన్ అవుట్ చేయడంతో లాన్నింగ్ తృటిలో సెంచరీని చేజార్చుకుంది.

Next Story