కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో భారీ షాక్.. స్టార్ అథ్లెట్‌ దూరం

by Harish |

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో భారీ షాక్ తగిలింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో భారీ షాక్.. స్టార్ అథ్లెట్‌ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : జూడో అథ్లెట్ అరుణ్ కుమార్ డోప్ టెస్టులో పట్టుబడి కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన విషయం తెలిసిందే. మరుసటి రోజే భారత్‌కు మరో భారీ షాక్ తగిలింది. జూడో క్రీడాకారిణి తులిక మాన్‌ కూడా ఈ ప్రతిష్టాత్మిక క్రీడల నుంచి వైదొలగింది. శుక్రవారం ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) తాత్కాలికంగా నిషేధం విధించింది. తన ఆచూకీని తెలియజేయడంలో విఫలమైన కారణంగా నాడా ఆమెపై వేటు వేయడంతో కామన్వెల్త్ గేమ్స్‌‌లో పాల్గొనాలనే ఆమె ఆశలు గల్లంతయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో పతక తెచ్చే అంచనాలు ఉన్న అథ్లెట్లలో తులిక ఒకరు. 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో ఆమె రజత పతకం గెలిచింది. 78+ కేజీల కేటగిరీలో పాల్గొనాల్సి ఉండగా..ఈ సారి కూడా ఆమెపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత 12 నెలల్లో ఆమె మూడుసార్లు తన ఆచూకీ వివరాలను వెల్లడించడంలో విఫలమైంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) ప్రకారం.. ఆచూకీ వివరాలు తెలియజేయకపోవడం డోపింగ్ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ కారణంగానే తులికకు నాడా నోటీసులు జారీ చేసింది. భారత జూడో జట్టు ఈ నెల 27న గ్లాస్గోకు బయల్దేరుతుంది. 31 నుంచి పోటీలు జరుగుతాయి. తులిక వైదొలగడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల సంఖ్య 122కు పడిపోయింది.

Next Story