Olympics: ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. ఆరు జట్లతో T20 ఫార్మాట్‌లో మ్యాచులు.. ఇంకా మరెన్నో క్రీడలు!

by Ramesh Naini |   (  Updated:2025-04-10 07:07:10  IST  )

క్రికెట్ అభిమానులకు శుభవార్త. 1900 తర్వాత తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ తిరిగి రానుంది.

Olympics: ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. ఆరు జట్లతో T20 ఫార్మాట్‌లో మ్యాచులు.. ఇంకా మరెన్నో క్రీడలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానులకు శుభవార్త. 1900 తర్వాత తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ తిరిగి రాబోతుంది. ఈ మేరకు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. 2028లో (Los Angeles 2028 Olympics) లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో మెన్స్, ఉమెన్స్ జట్ల క్రికెట్ ఉండబోతోందని అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇందులో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయని తెలిపింది. ఇంటర్నేషనల్ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాంకింగ్స్‌లో మొదట టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి. ఇలా చూస్తే ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ టీమ్‌కు చోటు దక్కే అవకాశం లేదు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అర్హత ప్రమాణాలు ఇంకా ఖరారు చేయలేదని తెలిసింది. అయితే, ఒలింపిక్స్‌లో అమెరికాకు పోటీల్లో స్థానం ఖరారవుతుందని అంచనాలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో దాదాపు 100 దేశాలు క్రికెట్‌ ఆడుతున్నాయి. వీటిలో నుంచి తుది జట్లను ఎంపిక చేయడం సవాల్‌తో కూడుకున్నదే అని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే, క్రికెట్‌తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్‌‌ లాంటి ఐదు క్రిడలను లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లోకి కొత్తగా తీసుకున్నారు.

ఐసీసీ చైర్మన్ జై షా వ్యూహం

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం ఈవెంట్ ప్రోగ్రామ్‌ను బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. 2028 క్రీడల్లో మొత్తం 351 పతకాల ఈవెంట్‌లు జరుగనున్నాయి. లాస్ ఏంజిల్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చే ప్రక్రియ 2021 ఆగస్టులోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సైతం ఒలిపిక్స్‌లో క్రికెట్ చేర్చాలని తన ఉద్దేశ్యాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ, ఎల్ఏ 2028 ఆర్గనైజింగ్ కమిటీ మధ్య సహకార ప్రయత్నానికి దారితీసింది. ఇక అక్టోబర్ 2023లో క్రికెట్‌ను ఐదు కొత్త క్రీడలలో ఒకటిగా అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. 2028లో క్రికెట్‌ను ఒలింపిక్ వేదికకు తీసుకురావాలనే ప్రచారంలో మాజీ బీసీసీఐ చీఫ్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా బ్రిస్బేన్ 2032తో సహా భవిష్యత్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఉనికిని నిర్ధారించడానికి ఐసీసీ చైర్మన్ జై షా ఇప్పటికే దీర్ఘకాలిక వ్యూహంపై పని చేస్తున్నారు.

128 ఏళ్ల తర్వాత తొలిసారి

128 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ తిరిగి ప్రవేశిస్తోంది. 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ నిర్వహించారు. ఇక అదే తొలిసారి, చివరిసారి అవ్వడం విశేషం. అందులో అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. అయితే ఆ మ్యాచుల్లో ఒక్క జాతీయ స్థాయి క్రీడకారులు లేకుండా మ్యాచ్‌లు పెట్టారు. ఆ మ్యాచుల్లో బ్రిటన్‌కు రజతం, ఫ్రాన్స్‌కు కాంస్యం పథకం వచ్చింది. ఆ తర్వాత పలు కారణాలతో క్రికెట్‌ను ఒలింపిక్స్‌ పోటీల నుంచి తీసివేశారు.

Next Story