కామన్వెల్త్ గేమ్స్: వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన జ్ఞానేశ్వరి.. భారత్‌కు రజతం!

by Ramesh Naini |

కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం జరిగిన మహిళల 53 కిలోల ఫైనల్స్‌లో భారత యువ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన జ్ఞానేశ్వరి.. భారత్‌కు రజతం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం జరిగిన మహిళల 53 కిలోల ఫైనల్స్‌లో భారత యువ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ తుది పోరులో నైజీరియా లిఫ్టర్ ఓనోమ్ ఓమోలోలా దీదీకి ఆఖరి వరకూ గట్టి పోటీ నిచ్చిన జ్ఞానేశ్వరి.. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు ఎత్తి మొత్తంగా 199 కిలోల బరువుతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా లిఫ్టర్ రికార్డు స్థాయిలో 206 కిలోలతో స్వర్ణం సాధించగా, కెనడాకు చెందిన రెబెకా గ్రౌల్క్స్ (178 కిలోలు) కాంస్యం దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి.. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుతో పోటీని తప్పించుకునేందుకే 49 కిలోల నుంచి 53 కిలోల విభాగానికి మారి, తన నిర్ణయం సరైనదేనని ఈ పతకంతో నిరూపించుకుంది.

మీరాబాయి చానుకు హ్యాట్రిక్ స్వర్ణం..

అంతకుముందు వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను మహిళల 48 కిలోల విభాగంలో ఏకంగా 190 కిలోలు ఎత్తి భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. కామన్వెల్త్ క్రీడల్లో (2018, 2022 తర్వాత) ఆమెకు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. తాజా విజయాలతో ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు (1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం) చేరుకుంది.

Next Story