Ranji Trophy : రంజీ ట్రోఫీ టైటిల్ విదర్భ కైవసం.. కేరళతో ఫైనల్ డ్రా.. విదర్భ ఎలా విజేతగా నిలిచిందో తెలుసా?

by Harish |

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 టైటిల్‌ను విదర్భ కైవసం చేసుకుంది.

Ranji Trophy : రంజీ ట్రోఫీ టైటిల్ విదర్భ కైవసం.. కేరళతో ఫైనల్ డ్రా.. విదర్భ ఎలా విజేతగా నిలిచిందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 టైటిల్‌ను విదర్భ కైవసం చేసుకుంది. నాగ్‌పూర్ వేదికగా కేరళ, విదర్భ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కారణంగా విదర్భ విజేతగా నిలిచింది. రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలవడం విదర్భకు ఇది మూడోసారి. వరుసగా 2017-18, 2018-19 సీజన్లలో టైటిల్ గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 379 రన్స్ చేసిన విదర్భ.. కేరళను 342 స్కోరుకు కట్టడి చేసి విలువైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆట కొనసాగించిన విదర్భ 143.5 ఓవర్లలో 375/9 స్కోరు చేసింది. విదర్భను ఆలౌట్ చేయడంలో కేరళ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో ఎలాగూ విజేతగా నిలిచే చాన్స్ ఉండటంతో విదర్భ బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ కేరళకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కరుణ్ నాయర్(135) సెంచరీతో చెలరేగగా.. డానిష్ మలేవర్(73), దర్శన్ నల్కండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. మ్యాచ్‌లో ఆదివారం చివరి రోజు కావడం విదర్భ తన బ్యాటింగ్ కొనసాగిస్తుండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భ విజేతగా నిలిచినట్టు వెల్లడించారు.

ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన డానిష్ మలేవార్(153, 73) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విదర్భ ఆల్‌రౌండర్ హర్ష్ దూబె‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అతను 69 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలవడంతోపాటు 476 రన్స్ చేశాడు. తొలిసారిగా ఫైనల్‌కు చేరుకున్న కేరళకు టైటిల్ పోరులో నిరాశ తప్పలేదు.


Next Story