వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్‌లో మార్పులు.. వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన

by Kema Shiva Kumar |

వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్‌లో ఐసీసీ చేసిన మార్పులపై వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ మండిపడుతోంది.

వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్‌లో మార్పులు.. వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో ఐసీసీ చేసిన మార్పులపై వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ (WCA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం తమకు సమాచారం లేకుండా ఫార్మాట్‌ను మార్చడంపై క్రికెటర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా మార్పులు ప్రపంచ క్రికెట్ వృద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని డబ్ల్యూసీఏ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వరల్డ్ కప్ కోసం ఏళ్ల తరబడి పెట్టుబడులు పెట్టి, క్వాలిఫికేషన్ మార్గాలను సిద్ధం చేసుకున్నాయని తెలిపింది. ఇలా కొత్త ఫార్మాట్ ఆ అవకాశాలను నీరుగారుస్తున్నారని వరల్డ్ క్రికెట్ అసొసియేషన్ పేర్కొంది. క్రికెట్ అభివృద్ధిలో కీలక భాగస్వాములైన క్రీడాకారులు, ఇతర వర్గాలతో సంప్రదించకుండానే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని క్రికెటర్ల సంఘం సీఈవో టామ్ మోఫాట్ విమర్శించారు. కొత్త ఫార్మాట్ ద్వారా దిగువ శ్రేణి జట్లకు పెద్ద జట్లతో ఆడే అవకాశం తగ్గిపోతుందని వాదిస్తున్నారు.

కాగా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఈసారి 14 జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే, గతంలో అనుకున్న ఫార్మాట్‌కు భిన్నంగా ఇప్పుడు కొత్తగా త్రీ-స్టేజ్ స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా, ర్యాంకింగ్‌లో దిగువన ఉన్న మూడు జట్లు ముందుగా ప్రిలిమినరీ సూపర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గ్రూప్ స్టేజ్, సూపర్ 7 రౌండ్లు, నాకౌట్స్ ఉంటాయి. దీంతో వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ఈ ఫార్మాట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Next Story