- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ సమరం.. ఆ జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది.

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత జట్టు పాక్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగతా మ్యాచ్‌లకు పాక్ వేదిక. రావల్పిండి, కరాచీ, లాహోర్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభంకానుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫార్మాట్ ఇలా..
టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 2023లో వన్డే వరల్డ్ కప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. టోర్నీ గ్రూపు స్టేజ్, నాకౌట్ దశల్లో జరగనుంది. ముందుగా 8 జట్లను నాలుగు టీమ్‌ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూపు-బిలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లను చేర్చారు. ప్రతి జట్టు ఇతర జట్టుతో ఒక్కసారి తలపడనుంది. ప్రతి గ్రూపులో టాప్-2 జట్లు నాకౌట్ రౌండ్‌కు చేరుకుంటాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది.
8 ఏళ్ల తర్వాత
చాంపియన్స్ ట్రోఫీ 1998 నుంచి జరుగుతుంది. చివరిసారిగా 2017లో జరిగింది. ఆ ఎడిషన్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ సాధించింది. ఆ తర్వాత పలు కారణాలతో చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహించలేదు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆ టోర్నీని నిర్వహిస్తున్నది.
భారత్ సాధిస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు మంచి రికార్డే ఉంది. 8 ఎడిషన్లలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2002, 2013లలో చాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా.. పాక్ చేతిలో ఓడిపోయింది. ఈ సారి టైటిల్ సాధించేందుకు రోహిత్ సేనకు ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ అని మాజీ క్రికెటర్లు కూడా చెబుతున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్ విజయం భారత ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం నింపేదే. అదే జోరును ఐసీసీ టోర్నీలోనూ కొనసాగించాలని చూస్తున్నది. గిల్, అయ్యర్ భీకర ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధానంగా బలంగా చెప్పుకోవచ్చు. రోహిత్, కోహ్లీ, రాహుల్ ఇంగ్లాండ్‌పై ఫామ్ అందుకోవడం భారీ ఊరట. రోహిత్, విరాట్‌లకు ఇదే ఐసీసీ ఆఖరి టోర్నీ అన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి వాళ్లపైనే ఉండనుంది. అక్షర పటేల్ బ్యాటుతో రాణిస్తుండటం సానుకూలంశం. పాండ్యా మెరుపులు మెరిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇక, బౌలింగ్ పరంగా బుమ్రా లేకపోవడం భారత్‌కు భారీ ఎదురుదెబ్బే. దీంతో షమీనే పేస్ భారం మోయనున్నాడు. పునరాగమనంలో అతను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం జట్టును ఆందోళనపరిచే అంశం. అయితే, పెద్ద టోర్నీలో అతని విజృంభణ వన్డే వరల్డ్ కప్-2023లో చూశాం. చాంపియన్స్ ట్రోఫీలోనూ అతను కీలక పాత్ర పోషించనున్నాడు. యువ పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ రాణా అతనికి తోడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, స్పిన్ పరంగా భారత్‌కు ఢోకా లేదు. జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. జడేజా ఇంగ్లాండ్‌పై అద్భుతంగా రాణించాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ సత్తాచాటేందుకు ఎదురుచూస్తున్నారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ భారత్ పేపర్‌పై బలంగానే కనిపిస్తున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శన, పక్కా వ్యూహాలతో ముందుకు సాగితే టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.
తీవ్ర పోటీ తప్పదు
సెమీస్‌కు చేరుకోవడం భారత్‌కు అంత సులభమేమీ కాదు. ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. గ్రూపు ఏలో భారత్‌పాటు కివీస్, పాక్, బంగ్లా జట్లు ఉన్నాయి. నాకౌట్ రౌండ్‌కు చేరుకోవాలంటే భారత జట్టు కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే. కాబట్టి, ఏ జట్టునూ తక్కువ అంచనా వేయొద్దు. పాకిస్తాన్‌తో ప్రతిసారి సవాలే. న్యూజిలాండ్‌తో గట్టి పోటీ తప్పదు. ఇటీవల ఆ జట్టు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నది. శ్రీలంకపై వన్డే సిరీస్‌తోపాటు ఇటీవల ట్రై సిరీస్ గెలుచుకుంది. ఇక, బంగ్లాదేశ్ తనదైన రోజున సంచలనం సృష్టించగలదు. ఆ జట్టుతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. కాబట్టి, రోహిత్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శనను నమ్ముకోవాల్సిన అవసరం ఉంది.
ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?
భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18 చానెల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొలిసారిగా ఓ ఐసీసీ టోర్నీని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో 9 భాషల్లో మ్యాచ్‌ను లైవ్‌లో చూడచ్చు.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు
ఫిబ్రవరి 20 భారత్ vs బంగ్లాదేశ్
ఫిబ్రవరి 23 భారత్ vs పాకిస్తాన్
మార్చి 2 భారత్ vs న్యూజిలాండ్






