అలా అని ఏడుస్తూ కూర్చోలేం కదా.. జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

అలా అని ఏడుస్తూ కూర్చోలేం కదా.. జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. చెత్త ఫీల్డింగ్, వచ్చిన క్యాచ్‌లు నేలపాలు చేయడంతో ఇంగ్లీష్ జట్టు 465 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్‌ 75 బంతుల్లో 47 పరుగులు, కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, ఫీల్డర్లు వరుస క్యాచ్‌లు నేలపాలు చేయడంపై భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఆటలో తప్పిదాలపై ఎక్కువ ఆలోచించడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. క్యాచ్‌లు వదిలేస్తే ఒక క్షణం నిరాశ కలుగుతుందని.. కానీ దాని గురించే కూర్చొని ఏడవలేం కదా అన్నారు. జట్టులో తొలిసారి ఆడుతున్న వారు కూడా ఉన్నారని.. కొత్తలో బంతి గుర్తించడం కష్టం ఉంటుందని, ఇవన్ని సహజమని తెలిపారు. ఎవరూ కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లు వదలరని.. త్వరలోనే అందరూ మెరుగుపడతారని పేర్కొన్నారు. క్యాచ్‌లు వదిలిన వారిపై చెడుగా రియాక్ట్ అవ్వడం.. కోపం చూపడం తన నైజం కాదని స్పష్టం చేశాడు. కాగా, యశస్వి జైస్వాల్ మూడు కీలక క్యాచ్‌లను వదిలినప్పటికీ.. బుమ్రా తన పట్టుదలతో విదేశీ గడ్డపై తన పదో ఐదు వికెట్ల హాల్‌ను సాధించాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. కష్టతరమైన విదేశీ పిచ్‌లలో 11 ఐదు వికెట్ల హాల్స్‌తో ఉన్న పాకిస్తాన్ యొక్క వసీం అక్రమ్ కంటే ఒకే ఒక్క అడుగు వెనుక ఉన్నాడు. అలాగే, విదేశీ టెస్టుల్లో మొత్తం 12 ఐదు వికెట్ల హాల్స్‌తో కపిల్ దేవ్ రికార్డును జస్ప్రీత్ బుమ్రా సమం చేశాడు.

Next Story