వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు అదిరే ప్రదర్శన.. క్వార్టర్ ఫైనల్స్‌కు క్వాలిఫై

by Harish |

వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు జ్ఞానదత్తు అదరగొడుతున్నాడు.

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు అదిరే ప్రదర్శన.. క్వార్టర్ ఫైనల్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : గువహతి వేదికగా జరుగుతున్న వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు జ్ఞానదత్తు అదరగొడుతున్నాడు. బాయ్స్ సింగిల్స్‌ విభాగంలో వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ప్లేయర్‌ను చిత్తు చేశాడు. అమెరికా షట్లర్ గార్రెట్ టాన్‌‌పై 15-21, 15-13 తేడాతో గెలుపొందాడు. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ జ్ఞానదత్తు ఎక్కడా పట్టుదల కోల్పోలేదు. దీంతో 30 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. టోర్నీలో బాయ్స్ సింగిల్స్‌లో భారత్‌ తరపున మిగిలిన ఏకైక షట్లర్ జ్ఞానదత్తే.

జ్ఞానదత్తుతోపాటు ఇతర భారత యువ షట్లర్లు కూడా సత్తాచాటుతున్నారు. గర్ల్స్ సింగిల్స్‌లో తన్వి శర్మ, ఉన్నతి హుడా కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో తన్వి 15-8, 15-5 చైనాకు చెందిన సున్ లి యువాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఉన్నతి 15-10, 15-7 తేడాతో మలేసియా క్రీడాకారిణి కరీన్ టీని ఓడించింది. పురుషుల డబుల్స్‌లో భార్గవ్ రామ్-విశ్వ తేజ్ జోడీ 15-13, 9-15, 13-15 తేడాతో చైనీస్ తైపీ జంట యి హ్సుయాన్ చెన్-చున్ యెన్ చు‌పై పోరాడి గెలిచి ముందంజ వేసింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్య-విశాఖ టొప్పొ ఏకంగా 3వ సీడ్‌కే షాకిచ్చింది. 40 నిమిషాలపాటు సాగిన ప్రీక్వార్టర్స్‌లో భారత ద్వయం 15-21 11-15, 12-15 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన థిబాల్ట్ గార్డన్-అగాథే క్యూవాస్ జంటపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.


Next Story