వరల్డ్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తన్వికి నిరాశ.. రజత పతకంతో సరి

by Harish |

బ్యాడ్మింటన్ యువ సంచలనం తన్వి శర్మ దిగ్గజ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

వరల్డ్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తన్వికి నిరాశ.. రజత పతకంతో సరి
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ యువ సంచలనం తన్వి శర్మ దిగ్గజ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇప్పటివరకు వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఏకైక భారత ప్లేయర్ సైనా(2008) మాత్రమే. తన్వి ఆ ఘనతను పునరావృతం చేసేలా కనిపించింది. గువహతి వేదికగా జరుగుతున్న వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె సంచలన ప్రదర్శన చేసింది. వరల్డ్ టైటిల్‌ దిశగా సాగిన ఆమె ఫైనల్‌లో బోల్తా పడటంతో తన్వి ఆశలు ఆవిరయ్యాయి. అయినప్పటికీ రజతం పతకంతో మెరిసింది.

ఆదివారం జరిగిన గర్ల్స్ సింగిల్స్ టైటిల్ పోరులో తన్వి 7-15, 12-15 తేడాతో థాయిలాండ్‌కు చెందిన ఫీచిత్‌ప్రీచాసక్ చేతిలో ఓడిపోయింది. 2023లో జరిగిన ఏసియన్ అండర్-17 జూనియర్ చాంపియన్‌షిప్‌లో థాయి ప్లేయర్‌పై తన్వి పైచేయి సాధించింది. ఈ సారి అద్భుతం చేయలేకపోయింది. తొలి సెట్‌లో అసలు పోటీనే ఇవ్వలేదు. అయితే, రెండో సెట్‌లో మాత్రం పుంజుకుంది. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆమె భారీ లీడ్‌లో కొనసాగింది. కానీ, ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రత్యర్థి పుంజుకోవడంతో తన్వి వెనకబడి మ్యాచ్‌ను సమర్పించుకుంది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఐదో భారత షట్లర్ తన్వి. ఆమె కంటే ముందు అపర్ణ(1996), సైనా నెహ్వాల్(2006), సిరిల్ వర్మ(2015), శంకర్ ముత్తుసామి(2022) రజత పతకం గెలిచారు.


Next Story