బ్యాడ్మింటన్లో చారిత్రక మార్పు: 2027 నుంచి కొత్త రూల్!

by Naga Rani Yarlagadda |

బ్యాడ్మింటన్ ఆటలో కీలక మార్పు చోటుచేసుకుంది. 2027 నుంచి స్కోర్ బోర్డులో కొత్త మార్పు వస్తున్నట్లు BWF ప్రకటించింది.

బ్యాడ్మింటన్లో చారిత్రక మార్పు: 2027 నుంచి కొత్త రూల్!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాడ్మింటన్ లో ఒక చారిత్రక మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్కోరింగ్ విధానాన్ని మారుస్తూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) కీలక నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

3x15 స్కోరింగ్ విధానం ఖరారు

ప్రస్తుతం అమల్లో ఉన్న 3x21 (మూడు గేమ్స్, ఒక్కోటి 21 పాయింట్లు) ఫార్మాట్‌కు స్వస్తి పలికి, దాని స్థానంలో 3x15 (మూడు గేమ్స్, ఒక్కోటి 15 పాయింట్లు) విధానాన్ని తీసుకురానున్నారు. 2027 జనవరి 4వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ మార్పు వల్ల ఆటగాళ్లపై శారీరక ఒత్తిడి తగ్గుతుందని, మ్యాచ్ సమయంపై స్పష్టత ఉంటుందని BWF అధ్యక్షుడు ఖున్యింగ్ పటామ లీస్వద్త్రాకుల్ పేర్కొన్నారు. ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

సైనా నెహ్వాల్ అభ్యంతరం

అయితే.. ఈ మార్పుపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో క్రీడ యొక్క సహజత్వాన్ని దెబ్బతీయకూడదని ఆమె హెచ్చరించారు. క్వాలిటీ ర్యాలీలు, పోటీతత్వం దెబ్బతినకుండా చూడాలని ఆమె సూచించారు. ఈ విమర్శలపై స్పందించిన BWF.. పాయింట్లు తగ్గినా ఆటలోని నైపుణ్యం, వ్యూహాలు, ఆట ప్రాథమిక స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

Next Story