సుల్తాన్ అజ్లాన్ షా కప్.. మరోసారి రన్నరప్‌తోనే సరి!

by Phanindra |

సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత జట్టు మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఫైనల్‌లో బెల్జియం చేతిలో ఓటమి మూటగట్టుకుంది.

సుల్తాన్ అజ్లాన్ షా కప్.. మరోసారి రన్నరప్‌తోనే సరి!
X

దిశ, స్పోర్ట్స్: సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారత్‌కు నిరాశే మిగిలింది. మలేసియాలోని ఇపో‌లో జరిగిన ఫైనల్‌లో బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకు అయిన బెల్జియంతో జరిగి ఉత్కంఠభరిత ఫైనల్‌లో భారత్ గట్టిపోటీనిచ్చిందనే చెప్పాలి. తొలి అర్ధభాగంలో బెల్జియం ఎంత దాడి చేసినా వారికి ఒక్క గోల్ కూడా రాకుండా భారత్ అడ్డుకుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే థిబియూ స్టాక్‌బ్రాక్స్ 34వ నిమిషంలో చూడచక్కని గోల్ సాధించాడు. ఆ తర్వాత తేరుకున్న భారత డిఫెన్స్.. బెల్జియంకు మరో అవకాశం ఇవ్వలేదు. కానీ స్కోర్లు సమం చేయడంలో విఫలమైంది. దీంతో మరోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ప్రపంచ ఏడో ర్యాంక్ జట్టయిన భారత్.. 2019లో చివరగా ఈ టోర్నీలో పాల్గొంది. అప్పుడు కూడా రన్నరప్‌గానే నిలిచింది. సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని 2010లో చివరిసారి భారత్ అందుకుంది. కాగా, గ్రూప్ దశలో కూడా బెల్జియం చేతిలో 3-2 తేడాతో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.

Next Story