ఆసియా గేమ్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ.. ఆ ఇద్దరినీ అందుకే పక్కనపెట్టారా?

by Naga Rani Yarlagadda |

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు బీసీసీఐ 30 మందితో లిస్టును పంపింది. ఈ లిస్టులో గిల్, సూర్యకుమార్ యాదవ్ పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది.

ఆసియా గేమ్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ.. ఆ ఇద్దరినీ అందుకే పక్కనపెట్టారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా గేమ్స్ లో.. పతకాన్ని సాధించడమే లక్ష్యంగా బీసీసీఐ భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఐచి-నగోయా (Aichi-Nagoya) వేదికగా సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు 30 మందితో కూడిన పురుషుల ప్రాబబుల్స్ జాబితాను సమర్పించింది. అయితే.. ఈ లిస్ట్‌లో ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టెస్ట్/వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. టీనేజ్ సంచలనంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీకి ఈ 30 మంది జాబితాలో చోటు దక్కింది.

ఒకే సమయంలో రెండు సిరీస్‌లు.. రెండు వేర్వేరు జట్లు!

ఏషియన్ గేమ్స్ (Asian Games 2026) జరిగే సమయంలోనే భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్-బాల్ సిరీస్ (White Ball) ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ విండీస్ సిరీస్‌లో 3 వన్డేలు, 5 టీ20లు ఉన్నాయి. మరోవైపు ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది. ఈ రెండు షెడ్యూళ్లు ఒకదానికొకటి ఓవర్‌లాప్ అవుతుండటంతో, బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో గిల్ జట్టును నడిపించాల్సి ఉన్నందున, అతడిని ఏషియన్ గేమ్స్ జాబితాకు తీసుకోలేదని సమాచారం. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా 2028 ఒలింపిక్స్, అలాగే తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్ పేరును సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ లాంగ్‌లిస్ట్‌లో అతడి పేరు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

రేసులో బుమ్రా.. కెప్టెన్సీకి ముగ్గురి పోటీ!

ఏషియన్ గేమ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే రేసులో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా, బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉండటం విశేషం. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బుమ్రాకు వన్డే సిరీస్ ప్రాధాన్యత అయ్యే అవకాశం ఉంది. గాయం నుండి కోలుకుంటున్న హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లు కూడా రేసులో ఉన్నారు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలు ఉన్నప్పటికీ.. వీరిలో ఇద్దరు మాత్రమే ఏషియన్ గేమ్స్‌కు వెళ్తారు. మిగిలిన ఇద్దరు విండీస్ సిరీస్ ఆడతారు. కాగా, గత హ్యాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ అందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం.

ఐఓఏ (IOA)కు సమర్పించిన లిస్టులో ఉన్నది వీరే..

యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.

Next Story