పోలీసు సెక్యూరిటీ బకాయిలు రూ.6 కోట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం

by Harish |

క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించిన ముంబై, పింప్రి చించ్‌వాడ్, నవీ ముంబై పోలీసులకు సెక్యూరిటీ బకాయిలను క్లియర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

పోలీసు సెక్యూరిటీ బకాయిలు రూ.6 కోట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించిన ముంబై, పింప్రి చించ్‌వాడ్, నవీ ముంబై పోలీసులకు సెక్యూరిటీ బకాయిలను క్లియర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండు వారాల్లోగా బకాయిలు చెల్లిస్తామని బోర్డు బాంబే హైకోర్టుకు తెలిపింది. బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా తాజాగా బీసీసీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 2013-18 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి పోలీసులకు ముంబై క్రికెట్ అసోసియేషన్ రూ.14.82 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం బకాయిలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెండింగ్ బకాయిల్లో బీసీసీఐ రూ. 6.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో ‘పోలీసులకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశం మాకు లేదు. పెండింగ్ బకాయిలను రెండు వారాల్లో క్లియర్ చేస్తాం.’ అని బీసీసీఐ పేర్కొంది. అలాగే, సెక్యూరిటీ ఏర్పాట్లు మ్యాచ్‌లను బట్టి ఉంటాయని, క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్, ఐపీఎల్ ఫైనల్స్, మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లతోపాటు అసాధారణ పరిస్థితుల్లో నిర్వహించే మ్యాచ్‌లకు మాత్రమే బీసీసీఐ బాధ్యత వహిస్తుందని తెలిపింది. క్రికెట్ మ్యాచ్‌ల భద్రత కోసం పోలీసులకు ఎంత చెల్లించాలనేది విధాన నిర్ణయమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.


Next Story