ఆ విషయంలో భారత క్రికెటర్లకు ఊరట.. వాళ్లను తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతి?

by Harish |

భారత క్రికెటర్లకు బీసీసీఐ ఊరటనిచ్చే విషయం చెప్పింది.

ఆ విషయంలో భారత క్రికెటర్లకు ఊరట.. వాళ్లను తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతి?
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఊరటనిచ్చే విషయం చెప్పింది. ‘నో ఫ్యామిలీ రూల్’ నుంచి ఆటగాళ్లకు కాస్త ఉపశమనం ఇచ్చినట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కి కుటుంబసభ్యులను వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత క్రికెటర్లకు, కోచింగ్ సిబ్బందికి పలు సౌకర్యాల విషయంలో బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన కఠిన నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో ఆటగాళ్లు జీవిత భాగస్వాములు, కుటుంబసభ్యులను తమ వెంటే తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించింది.

ఆ నిబంధన ప్రకారం.. నెల పాటు విదేశీ టూరులో ఉంటే మాత్రమే ప్లేయర్లు 7 రోజులు మాత్రమే కుటుంబసభ్యులతో గడిపేందుకు అనుమతి ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది. అయితే, ‘నో ఫ్యామిలీ రూల్’ విషయంలో తాజాగా బీసీసీఐ ప్లేయర్లకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బోర్డు చెప్పినట్టు పేర్కొన్నాయి.

అయితే, అందుకు ఓ షరత్ పెట్టినట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ప్లేయర్ల వెంట కుటుంబసభ్యులను అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆటగాళ్లందరూ చర్చించుకుని బోర్డుకు అభ్యర్థన చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేయనున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.


Next Story