BCCI : ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు.. షరతులు ఇవే ! : బీసీసీఐ

by Y. Venkata Narasimha Reddy |

BCCI : ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు.. షరతులు ఇవే ! : బీసీసీఐ
X

దిశ, వెబ్ డెస్క్ : దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025 సందర్భంగా భారత క్రికెట్ జట్టు(Indian cricket team) సభ్యులు తమ కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకెళ్లడాని(Ttake Family Members With Themselves)కి ఎట్టకేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) అనుమతించింది. అయితే షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంది.

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వన్డే సిరీస్‌లోనే టీమిండియా ఖంగుతిన్నది. పసికూన శ్రీలంక చేతిలో 0-2తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో టీమిండియా ఖంగుతిన్నది. ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. 2012-13లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఓటమి అనంతరం సొంతగడ్డపై టీమిండియాకు ఎదురైన సిరీస్ ఓటమి ఇదే.

అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్ట్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి 3-1‌తో సిరీస్ కోల్పోయింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. డబ్ల్యూటీసీ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్.. ఈ సారి మాత్రం అర్హత సాధించలేకపోయింది. టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంతో బీసీసీఐ ఆటగాళ్లు, స్టాఫ్‌కు కొన్ని కఠిన నియమాలను అమలు చేసింది. క్రికెటర్లు తమ భాగస్వాములు, కుటుంబసభ్యులను వెంట తీసుకెళ్లడం సహా పలు సౌలభ్యాల విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది.

చాంపియన్స్ ట్రోఫీకి కూడా అవే కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఈ మార్గదర్శకాలలో కొంత సడలింపు ఇస్తూ తాజాగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతి ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. అయితే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను ఏ మ్యాచ్‌కు ఆహ్వానించాలనుకుంటున్నారో ముందుగా బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.

బీసీసీఐ అంతకుముందు ఉన్న నిబంధనల మేరకు చూసుకుంటే 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్న విదేశీ పర్యటనలలో మాత్రమే ఆటగాళ్లు తమ కుటుంబాలతో రెండు వారాల పాటు ఉండటానికి అనుమతి ఉండేది. మూడు వారాలు పాటు కొనసాగే చాంపియ‌న్స్ ట్రోఫీ శ‌నివారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 23వ తేదీన మ్యాచ్ జరగనుంది.

శ్రీలంక, న్యూజిలాండ్, అసీస్ ద్వేపాక్షిక సిరీస్ లలో వరుస పరాజయాల అనంతరం ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. అనంతరం రోహిత్ శర్మ సారధ్యంలో వన్డే సిరీస్ ను 3-0తో విజయం సాధించింది. ఈ విజయాలతో చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఉత్సాహంతో బయలుదేరింది.

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్

ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ

ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్

ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్

ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి

ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్

ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి

ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్

మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ

మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్

మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్

మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్

మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో ఆడతారు)

మార్చి 10 - రిజర్వ్ డే.

Next Story