వాళ్లు తీసేయడం ఏంటి?.. నేనే తప్పుకున్నా.. బంగ్లా ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగిన ప్రెజెంటర్ రిధిమా పాఠక్

by Harish |   (  Updated:2026-01-07 14:33:04  IST  )

వాళ్లు తీసేయడం ఏంటి?.. నేనే తప్పుకున్నా.. బంగ్లా ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగిన ప్రెజెంటర్ రిధిమా పాఠక్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)‌ నుంచి తప్పుకుంది. లీగ్‌కు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ప్రెజెంటేషన్ ప్యానెల్ నుంచి వైదొలిగింది. భారత్, బంగ్లా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్‌ను కూడా ప్రభావితం చేశాయి. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టు నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లా ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్‌‌లో ఆడటానికి తాము భారత్‌కు రాలేమని, తమ మ్యాచ్‌లను మరోచోట నిర్వహించాలని ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిధిమా ఠాకూర్ బీపీఎల్ నుంచి వైదొలిగింది. అయితే, బీపీఎల్ ప్రెజెంటేషన్ ప్యానెల్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే ఆమెను తొలగించినట్టు మొదట వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రిధిమా ఖండించింది. తానే బీపీఎల్ నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ‘బీపీఎల్ నుంచి నన్ను తొలగించారనే వార్తలు వస్తున్నాయి. కానీ, అవి నిజం కాదు. నేనే వైదొలిగాను. ఎల్లప్పుడూ నాకు దేశమే ముఖ్యం. నిజాయతీ, గౌరవం, అభిరుచితో క్రికెట్‌కు సేవ చేస్తున్నాను. దాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటా.’అని రిధిమా పాఠక్ తెలిపింది.

Next Story