పాక్ లీగ్‌లో బాల్ టాంపరింగ్.. అడ్డంగా దొరికిపోయిన పాక్ స్టార్ క్రికెటర్

by Harish |

పాక్ లీగ్‌లో బాల్ టాంపరింగ్.. అడ్డంగా దొరికిపోయిన పాక్ స్టార్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడం క్రికెట్‌లో కలకలం రేపింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆదివారం కరాచీ కింగ్స్‌, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. కరాచీ కింగ్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 రన్స్ అవసరమయ్యాయి. ఆ ఓవర్‌ వేయకముందు లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హరిస్ రవూఫ్ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఫఖర్ బంతిని తన చేతి వేలితో గీకినట్టు వీడియోలో కనిపించింది. దీన్ని అంపైర్ ఫైసల్ అఫ్రిది గుర్తించాడు. రవూఫ్ నుంచి బంతిని తీసుకుని పరిశీలించాడు. బంతి రూపురేఖలను మార్చినట్లు గుర్తించాడు.

దీంతో అంపైర్ లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించాడు. అలాగే, కొత్త బంతితో బౌలింగ్ చేయించాడు. చివరి ఓవర్‌లో 14 రన్స్ లక్ష్యం కాస్త 9కి తగ్గింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే కరాచీ గెలిచింది. ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అతనిపై లెవల్ 3 నేరాన్ని మోపారు. అయితే, ఫఖర్ జమాన్‌ క్రమశిక్షణా విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్టు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. 48 గంటల్లో మరోసారి విచారణ జరుగుతుందని, ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ తీర్పు ఇస్తారని తెలిపింది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు మ్యాచ్ రిఫరీ తేల్చితే ఫఖర్ జమాన్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.

Next Story