ఆసియా బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ సంచలనం.. వరల్డ్ నం.7కు షాక్

by Harish |

ఆసియా బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ సంచలనం.. వరల్డ్ నం.7కు షాక్
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆయుశ్ సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో అద్భుత విజయం సాధించాడు. వరల్డ్ నం.7 ఆటగాడు లి షి ఫెంగ్‌ను మట్టికరిపించాడు. 51 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో ఆయుశ్ 21-13, 21-16 తేడాతో గెలుపొందాడు. తొలి రౌండ్‌లో కఠిన ప్రత్యర్థి ఎదురైనా ఆయుశ్ ఏ మాత్రం ఒత్తిడికి గురికాలేదు. తన కంటే మెరుగైన ర్యాంకర్ అయిన ఫెంగ్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేము అలవోకగా నెగ్గగా.. రెండో గేములో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఒక దశలో 12-9తో వెనుకబడ్డాడు. కానీ, అక్కడి నుంచి పుంజుకుని ప్రత్యర్థికి మరో చాన్స్ ఇవ్వలేదు. మరో భారత ఆటగాడు హెచ్.ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 24-22, 21-12 తేడాతో వియత్నంకు చెందిన హాయ్ డాంగ్‌పై విజయం సాధించాడు.

సింధు శుభారంభం

భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై విక్టరీ నమోదు చేసింది. అయితే, తొలి రౌండ్‌ను ప్రత్యర్థి 21-15తో నెగ్గడంతో ఆరంభంలో సింధుకు షాక్ తగిలింది. కానీ, ఆ తర్వాత తన సత్తా చూపించింది. వరుసగా రెండు సెట్లను 21-11, 21-19తో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. యువ షట్లర్లు తన్వి శర్మ, మాళవిక బాన్సోద్‌లకు నిరాశ తప్పలేదు. తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారిపట్టారు.

తొలి రోజే షాక్‌లు

ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్‌కు భారీ షాక్‌లు తగిలాయి. పతకం సాధిస్తాడనుకున్న లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం. హాంకాంగ్ ప్లేయర్ లీ చెయుక్ యియు చేతిలో 21-12, 21-19 తేడాతో సేన్ పరాజయం పాలయ్యాడు. గత నెలలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ టోర్నీలో సేన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సేన్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ సారి సింగిల్స్‌లో పతకం తెస్తాడని ఆశించినా నిరాశే ఎదురైంది. ఇక, కొంతకాలంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శ్రీకాంత్ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. సింగపూర్ ప్లేయర్ లోహ్ కీన్ యూ చేతిలో 21-18, 9-21, 11-21 తేడాతో చిత్తయ్యాడు. తొలి గేము నెగ్గి మ్యాచ్‌లో శుభారంభమే చేసినా మిగతా రెండు గేముల్లో మాత్రం ప్రత్యర్థి ముందు తేలిపోయాడు.


Next Story