Australian Open : వరల్డ్ నం.6కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

by Harish |

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు.

Australian Open : వరల్డ్ నం.6కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న అతను ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీస్‌లో సేన్ 17-21, 24-22, 21-16 తేడాతో వరల్డ నం. 6, చైనీస్ తైపీకి చెందిన చౌ టెయిన్ చెన్‌పై అద్భుత విజయం సాధించాడు. గంటా 26 నిమిషాలపాటు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేము‌లో ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శించాడు. సేన్‌ పోరాడినప్పటికీ నిరాశ తప్పలేదు. కానీ, ఆ తర్వాత అతను బలంగా పుంజుకున్నాడు. మిగతా రెండు సెట్లలో పోరాట పటిమ కనబరిచాడు.

అయితే, రెండో గేములో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోరాడాడు. ఆధిక్యం అనేకసార్లు చేతులు మారింది. చివరికి 22-22 వద్ద సేన్ వరుసగా రెండు పాయింట్స్ గెలవడంతో రెండో గేము అతని సొంతమైంది. దీంతో స్కోరును సమం చేసి మ్యాచ్‌ను మూడో గేముకు తీసుకెళ్లాడు. అక్కడ సేన్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో సేన్.. జపాన్‌కు చకందిన యుషి టనాకతో తలపడనున్నాడు. ఈ ఏడాది సేన్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న అతను రన్నరప్‌గానే సరిపెట్టాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో ఫైనల్. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సేన్ టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడో లేదో చూడాలి.


Next Story