Australian Open : తొలి రౌండ్‌లో పోరాడి గెలిచిన సిన్నర్.. జకో, అల్కరాజ్ కూడా శుభారంభం

by Harish |
Australian Open : తొలి రౌండ్‌లో పోరాడి గెలిచిన సిన్నర్.. జకో, అల్కరాజ్ కూడా శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ)కు ఆరంభం ఊహించిన రీతిలో దక్కలేదు.టోర్నీలో బోణీ కొట్టాడుగానీ.. తొలి రౌండ్‌ను దాటడానికి అతను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చిలీ ప్లేయర్ నికోలస్ జర్రీపై వరల్డ్ నం.1 సిన్నర్ పోరాడి గెలిచాడు. రెండు గంటల 40 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సిన్నర్ 7-6(7-2), 7-6(7-5), 6-1 తేడాతో విజయం సాధించాడు. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోటీపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అన్‌సీడ్ ఆటగాడి నుంచి సిన్నర్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. మూడో సెట్ మాత్రమే అతను సునాయాసంగా నెగ్గాడు. తొలి రెండు సెట్లలో వరల్డ్ నం.1 చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి ఆ రెండు సెట్లను టై బ్రేకర్‌లోనే నెగ్గాడు. సిన్నర్‌తో పోలిస్తే జర్నీనే ఎక్కువగా ఏస్‌లు, విన్నర్లు సంధించాడు. సిన్నర 7 ఏస్‌లు, 24 విన్నర్లు కొడితే.. జర్రీ 13 ఏస్‌లు, 40 విన్నర్లు బాదాడు. అయితే, చిలీ ప్లేయర్ నాలుగు డబుల్ ఫౌల్ట్స్, 50 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో టైటిల్ ఫేవరెట్ జకోవిచ్(సెర్బియా) కూడా బోణీ కోసం పోరాటం చేశాడు. తొలి రౌండ్‌లో తెలుగు మూలాలు ఉన్న నిశేష్ బసవారెడ్డి(అమెరికా) పోటీ ఇవ్వడంతో జకోకు నాలుగో సెట్‌‌లో విజయం దక్కింది. 6-4, 3-6, 4-6, 2-6 తేడాతో గెలుపొందాడు. మ్యాచ్‌లో తొలి సెట్‌ను నెగ్గిన నిశేష్.. జకోకు షాకిచ్చాడు. అనంతరం పుంజుకున్న జకో వరుసగా మూడు సెట్లు నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ షెవ్చెంకో(కజకస్థాన్)పై 1-6, 5-7, 1-6 తేడాతో విజయం సాధించాడు.

స్వైటెక్ శుభారంభం

ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.2 ఇగా స్వైటెక్(పొలాండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి సినియాకోవాపై 3-6, 4-6 తేడాతో గెలుపొందింది. ప్రత్యర్థి కాస్త పోరాటం చేసినప్పటికీ స్వైటెక్ తన అనుభవంతో పైచేయి సాధించింది. అమెరికా యువ సంచలనం కోకా గాఫ్, మాజీ చాంపియన్ నవోమి ఒసాకా(జపాన్) కూడా బోణీ కొట్టారు. తొలి రౌండ్‌లో గాఫ్ 6-3, 6-3 తేడాతో సహచర క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై, ఒసాకా 6-3, 3-6, 6-3 తేడాతో కరోలిన్ గార్సియా(ఫ్రాన్స్)పై విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed