IND VS AUS : అడిలైడ్‌లో సత్తాచాటుతారా?.. నేటి నుంచే రెండో టెస్టు

by Harish |

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచి రెండో ట

IND VS AUS : అడిలైడ్‌లో సత్తాచాటుతారా?.. నేటి నుంచే రెండో టెస్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. పెర్త్‌ టెస్టును అద్బుత ప్రదర్శనతో దక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్నది. ఇప్పుడు అదే జోరులో రెండో టెస్టుకు సిద్ధమైంది. నేటి నుంచే అడిలైడ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం. రెండో టెస్టు‌ను డే అండ్ నైట్‌‌గా జరగనుండటంతో పింక బాల్‌తో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. తొలి టెస్టు విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పింక్ బాల్ టెస్టులోనూ సత్తాచాటాలని రోహిత్ సేన భావిస్తున్నది. మరోవైపు, అడిలైడ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా చూస్తున్నది.

వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతని గైర్హాజరులో బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్‌గా నిరూపించుకోవడంతోపాటు పేసర్‌గా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. గాయం కారణంగా పెర్త్‌లో ఆడలేకపోయిన గిల్ ‌కూడా పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నాడు. వీరిద్దరి రాకతో భారత్ బ్యాటింగ్ దళం మరింత పెరిగింది. జైశ్వాల్, రాహుల్, కోహ్లీ ఫామ్‌ అందుకోవడం సానుకూలంశం. తొలి టెస్టులో ఈ త్రయం ఆకట్టుకుంది. అలాగే, బౌలింగ్ పరంగా కూడా టీమిండియాకు ఢోకా లేదు. బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్, హర్షిత్ రాణా కూడా తొలి టెస్టులో సత్తాచాటారు. మరోవైపు, ఆసిస్ కూడా బలంగానే ఉన్నది. తొలి టెస్టులో ఓడినప్పటికీ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే.

వాళ్లు ఔట్

రోహిత్, గిల్ రాకతో భారత్ తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనర్ ఎవరు?అన్న ప్రశ్నకు రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. జైశ్వాల్‌తో కేఎల్ రాహులే ఓపెనింగ్ చేస్తాడని స్పష్టతనిచ్చాడు. రోహిత్ మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కోల్పోనున్నాడు. అలాగే, గిల్ రాకతో పడిక్కల్ చోటు కూడా గల్లంతుకానుంది. తొలి టెస్టులో పడిక్కల్, ధ్రువ్ జురెల్ నిరాశపరిచారు. అలాగే, సుందర్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. అతని స్థానంలో టీమ్ మేనేజ్‌‌మెంట్ అశ్విన్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

వర్షం ముప్పు

రెండో టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ముఖ్యంగా తొలి రోజు ఆటకు వరుణుడు అడ్డు తగిలే సూచనలు ఉన్నాయి. వాతావరణ నివేదికల ప్రకారం.. శుక్రవారం ఉరుములతో కూడిన వర్షం పడనుంది. మధ్యాహ్నం వర్షం అంతరాయం కలిగించే చాన్స్ ఎక్కువగా ఉంది. స్థానిక కాలమానం ప్రకారం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై వర్షం పడేందుకు 47 శాతం అవకాశం ఉంది. అలాగే, ఒంటి గంటకు ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 51 శాతం చాన్స్ ఉంది. అయితే, 2 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టొచ్చని నివేదికలు చెబుతున్నాయి.

పిచ్ రిపోర్టు

అడిలైడ్ ఓవల్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమంగా అనుకూలించనుంది. స్వింగ్ బౌలర్లు ప్రభావం చూపనున్నారు. బ్యాటర్లు ఓపికగా ఉంటే భారీ స్కోర్లు చేయొచ్చు.చిరు జల్లులు పడితే పిచ్‌పై ప్రభావం చూపొచ్చు. అదే జరిగితే బౌలర్లకు పిచ్ మరింత అనుకూలంగా మారుతుందని అడిలైడ్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ తెలిపాడు. గత మ్యాచ్‌లను పరిశీలిస్తే మాత్రం బౌలర్లతో పోలిస్తే బ్యాటర్లే ప్రభావం చూపించారు.

భారత్ 3.. ఆసిస్ 11

పింక్ బాల్ టెస్టుల్లో భారత్, ఆసిస్ సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీమిండియా 4 డే అండ్ నైట్ మ్యాచ్‌ల్లో మూడింటి విజయం సాధించింది. మరో మ్యాచ్ ఆసిస్ చేతిలోనే ఓడింది. మరోవైపు, ఆసిస్ 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించింది. వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది.

ఎక్కడ చూడొచ్చంటే?

అడిలైడ్ టెస్టును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్‌లో వీక్షించొచ్చు. అలాగే, డిస్న+ హాట్‌ స్టార్‌లోనూ లైవ్ టెలీకాస్ట్ కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. 4:30 గంటలకు ముగియనుంది.

Next Story