సెమీస్‌కు దూసుకెళ్లిన నిఖత్ జరీన్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

by Harish |

సెమీస్‌కు దూసుకెళ్లిన నిఖత్ జరీన్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం
X

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ బాక్సర్, మాజీ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంది. సెమీస్‌కు వెళ్లడంతో ఆమెకు మెడల్ ఖరారైంది. 51 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన నిఖత్ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాన్ బగుహిన్‌పై విజయం సాధించింది. తొలి రౌండ్‌లో బై పొందిన ఆమె క్వార్టర్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఎటాకింగ్ గేము ఆడుతూ ప్రత్యర్థిపై పిడుగల్లే పడింది. దీంతో రిఫరీ తొలి రౌండ్‌లోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్ గెలిచినట్టు ప్రకటించారు. అయితే సెమీస్‌లో నిఖత్‌కు గట్టి సవాలే ఎదురుకానుంది. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడితే కనీసం కాంస్యం గెలుస్తుంది. 60 కేజీల కేటగిరీలో ప్రియా ఘంఘాస్, 54 కేజీల కేటగిరీలో ప్రీతి పవార్ కూడా సెమీస్‌కు చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రియ 4-1 తేడాతో చైనాకు చెందిన యాంగ్ చెంగ్యూ‌ను ఓడించగా.. ప్రీతి 5-0 తేడాతో మంగోలియా బాక్సర్ ముంగుంట్‌సెట్‌సెంగ్‌పై విజయం సాధించింది. శనివారం క్వార్టర్స్‌లో సచిన్(60 కేజీలు), నరేందర్(90+ కేజీలు), విశ్వనాథ్ సురేశ్(50 కేజీలు), ఆదిత్య ప్రతాప్ యాదవ్65 కేజీలు), అంకుషిత బోరో(మహిళల 65 కేజీలు) తలపడనున్నారు.


Next Story