- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు.. నాలుగో రోజూ పతకాల పంట
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతక పంట పండిస్తున్నారు.

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ అమ్మాయి అగసర నందిని సత్తాచాటింది. ఆసియా క్రీడల బ్రాంజ్ మెడలిస్ట్ అయిన నందిని మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. సౌత్ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. మల్టీ ఈవెంట్స్ కలిగిన హెప్టాథ్లాన్‌లో మొత్తం 5,941 పాయింట్స్‌తో విజేతగా నిలిచింది. హెప్టాథ్లాన్‌లో గురువారం 100 మీటర్ల హార్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల ఈవెంట్స్ ముగియగా.. నందిని 2,631 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం కూడా అదే జోరు కొనసాగించింది. లాంగ్ జంప్‌లో 6.13 మీటర్ల ప్రదర్శనతో 890 పాయింట్స్ సాధించిన ఆమె జావెలిన్ త్రోలో 34.18 మీటర్లు బల్లెం విసిరి 556 పాయింట్లు పొందింది. ఇక, చివరిదైన 800 మీటర్ల రేసును 2:15.54 సెకన్లలో ముగించి 885 పాయింట్లు సాధించడంతో నందిని మొత్తం 5,941 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. సోమా బిస్వాస్(2005), స్వప్న బర్మాన్(2017) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో హెప్టాథ్లాన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నందిని నిలిచింది.
గుల్వీర్ డబుల్ ధమాకా
ఆసియా చాంపియన్‌షిప్‌లో రన్నర్ గుల్వీర్ సింగ్ రెండో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. తొలి రోజు 10,000 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం 5,000 మీటర్ల ఈవెంట్‌లోనూ బంగారు పతకం సాధించాడు. గుల్వీర్ 13:24.77 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. అదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత రన్నర్ అభిషేక్ పాల్(13:33.51 సెకన్లు) 6వ స్థానంతో సరిపెట్టాడు. ఇక, హైజంపర్ పూజ కూడా సత్తాచాటింది. 1.89 మీటర్ల ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం సాధించిన రెండో భారత మహిళా హైజంపర్‌గా ఘనత సాధించింది. పూజ కంటే ముందు బాబీ అలోసియస్ 2000లో గోల్డ్ గెలిచింది. మరోవైపు, మహిళల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో పారుల్ చౌదరి రజతం కొల్లగొట్టింది. 9:12.46 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలవడంతోపాటు జాతీయ రికార్డును నెలకొల్పింది. శుక్రవారం మూడు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరాయి. దీంతో 18 పతకాలతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.






