ముగింపు అదిరేలా.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు ఆరు పతకాలు కైవసం

by Harish |

సౌత్ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత అథ్లెట్లు ఘనంగా ముగించారు.

ముగింపు అదిరేలా.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు ఆరు పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత అథ్లెట్లు ఘనంగా ముగించారు. మొదటి రోజు నుంచి పతకాల పంట పండించిన అథ్లెట్లు ఆఖరి రోజైన శనివారం కూడా అదరగొట్టారు. చివరి రోజు ఆరు పతకాలు సాధించి అదిరిపోయే ముగింపు ఇచ్చారు. ఆఖరి రోజు స్వర్ణం దక్కకపోవడం కాస్త నిరాశ పరిచే అంశం. పురుషుల జావెలిన్ త్రోలో సచిన్ యాదవ్ రజతం సొంతం చేసుకున్నాడు. 85.16 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 86.40 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచాడు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ టోర్నీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

మహిళల 5,000మీటర్ల రేసులో పారుల్ చౌదరి సిల్వర్ మెడల్ గెలిచింది. 15:15.33 సెకన్లలో ఆమె రేసును ముగించింది. ఈ టోర్నీలో పారుల్ చౌదరికి ఇది రెండో మెడల్. 3,000 మీటర్ల స్టీపుల్‌‌చేజ్‌లో ఆమె రజతం గెలిచిన విషయం తెలిసిందే. మహళల 4x100 మీటర్ల రిలే జట్టు కూడా సిల్వర్ మెడల్ గెలిచింది. 43.86 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పతకం గెలిచిన భారత జట్టులో స్రాబని నందా, స్నేహ, అభినయ, నిత్య ఉన్నారు. అలాగే, మహిళల 400 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో విథ్య రామ్‌రాజ్ 56.46 సెకన్లలో రేసును ముగించి కాంస్యం సాధించింది.

పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌లో అనిమేశ్ కుజుర్ కూడా బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. 20.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. అంతేకాకుండా,ఆసియా చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల ఈవెంట్‌లో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్ కూడా అతనే. ఇక, మహిళల 800 మీటర్ల రేసులో పూజ 2:01.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం కైవసం చేసుకుంది. ఆఖరి రోజు ఆరు పతకాలు దక్కడంతో భారత్ టోర్నీలో మొత్తం 24 మెడల్స్‌ సాధించింది. 8 స్వర్ణాలు, 10 రజతాలు, ఆరు కాంస్య పతకాలు గెలిచిన భారత్ మెడల్ టేబుల్‌లో రెండో స్థానంతో ముగించింది. చైనా 26 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత ఎడిషన్ ప్రదర్శనను భారత్ బద్దలుకొట్టలేకపోయింది. 2023లో జరిగిన టోర్నీలో 27 పతకాలు దక్కాయి.

Next Story