- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పతక పంట.. మూడు స్వర్ణాలు సహా ఒకే రోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు

దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, వైజాగ్‌కు చెందిన అథ్లెట్ యర్రాజి జ్యోతి మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. సౌత్ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో గురువారం బంగారు పతకం కైవసం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో విజేతగా నిలిచింది. గతేడాది కూడా ఇదే ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఆమె ఈ సారి కూడా చాంపియన్ హోదాను కాపాడుకుంది. జ్యోతి 12.96 సెకన్లలోనే రేసును ముగించింది. ఈ ప్రదర్శనతో కొత్త ఆసియా అథ్లెటిక్స్ రికార్డును నెలకొల్పింది. జపాన్‌కు చెందిన యుమి టనాకా (13.07), చైనా అథ్లెట్ యు యాన్ని(13.07)లను వెనక్కినెట్టి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మహిళల లాంగ్ జంప్‌లో రెండు మెడల్స్ దక్కాయి. ఆన్సీ సోజన్(6.33 మీటర్లు) రజతం గెలవగా.. శైలి సింగ్(6.30 మీటర్లు) కాంస్యం సాధించింది.
36 ఏళ్ల తర్వాత సబ్లే
భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. సీజన్ బెస్ట్ ప్రదర్శన చేసిన అతను 8:20.92 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. ఈ ఈవెంట్‌లో 36 ఏళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. 1989లో దినా రామ్ తర్వాత 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సబ్లే నిలిచాడు. ఆసియా అథ్టెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సబ్లేకు ఇది తొలి స్వర్ణం. 2019లో రజతం సాధించాడు.
అలాగే, మహిళల 4x400 రిలే టీమ్ కూడా 3:34.18 సెకన్లలో రేసును పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలిచింది. జట్టులో జిస్నా మాథ్యూ, రూపాల్ చౌదరి, కుంజ రజిత, సుభా వెంకటేసన్‌లు ఉన్నారు. 12 ఏళ్ల మహిళల 4x400 రిలే టీమ్ స్వర్ణం దక్కించుకోవడం గమనార్హం. ఇంతకుముందు 2013లో దక్కింది. పురుషుల 4x400 రిలే టీమ్‌కు కూడా పతకం దక్కింది. జై కుమార్, ధర్మ్‌వీర్ చౌరది, మను టెక్కినాలిల్ సాజీ, విశాల్‌లతో కూడిన భారత జట్టు(3:03.67 సెకన్లు) రజతం సాధించింది. దీంతో గురువారం ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 పతకాలు చేరాయి. మొత్తం 14 పతకాలతో భారత్ మెడల్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంది.






