Asia Cup : గిల్ లేనట్టేనా?. సిరాజ్‌ కూడా నిరాశే?.. రేపే భారత జట్టు ప్రకటన

by Harish |   (  Updated:2025-08-18 15:01:50  IST  )

ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించనుంది.

Asia Cup : గిల్ లేనట్టేనా?. సిరాజ్‌ కూడా నిరాశే?.. రేపే భారత జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి ఎంపిక చేసే భారత జట్టు గురించే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి చోటు దక్కుతుందో? అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సెలెక్టర్లకు కూడా జట్టు ఎంపిక సవాల్‌గానే మారింది. అయితే, మంగళవారం భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో సమావేశం కానుంది. ఈ మీటింగ్ అనంతరం జట్టును వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సెలెక్టర్లు జట్టు కూర్పుపై ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బ్యాకప్ ఓపెనర్‌గా జైశ్వాల్

టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జట్టులో స్థానం లేనట్టే కనిపిస్తుంది. అతను కచ్చితంగా మూడు ఫార్మాట్ల ప్లేయర్. అందులో సందేహం అక్కర్లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 650 స్కోరు చేశాడు. అయితే, జాతీయ జట్టుకొచ్చే సరికి అతను ఎక్కువగా టెస్టులపై ఫోకస్ పెట్టాడు. అతని గైర్హాజరీలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటమే కాకుండా నిలకడగా రాణించారు. దీంతో ఓపెనర్లుగా వారి స్థానాలు పదిలమే. బ్యాకప్ ఓపెనర్‌గా కూడా గిల్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. మరో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మూడో స్థానంలో ఇప్పటికే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పాతుకపోయాడు. టీ20ల్లో వరల్డ్ నం.2గా కొనసాగుతున్న తిలక్ నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో అతన్ని తప్పించడం కష్టమే. మొత్తంగా ఆసియా కప్‌కు గిల్ దూరం కావడం తప్ప మరో దారి కనిపించడం లేదు. ఒకవేళ గిల్ తీసుకోవాల్సి వస్తే మరో ప్లేయర్‌పై వేటు వేయక తప్పదు.

బుమ్రా ఇన్.. సిరాజ్ ఔట్

స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ టూరులో అతను అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసింది కూడా అతనే. జస్ప్రిత్ బుమ్రా కూడా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో సిరాజ్ ఎంపిక లాంఛనమే అనిపించింది. కానీ, బుమ్రా ఆసియా కప్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే, ఇతర పేస్ బౌలింగ్ ఆప్షన్లుగా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా పేర్లను పరిశీలిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సిరాజ్‌కు స్థానం దక్కడం కష్టమే. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ కూడా సెలెక్టర్ల పరిశీలనలో లేడు.

అయ్యర్‌కు చోటు దక్కేనా?

సెలెక్టర్లకు సవాల్‌గా మరో ఎంపిక శ్రేయస్ అయ్యర్. కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్‌లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతనిదే కీలక పాత్ర. ఐపీఎల్‌లో కూడా అదే జోరు కొనసాగించిన అయ్యర్ 175 స్ట్రైక్‌రేట్‌తో 604 రన్స్ చేశాడు. అయితే, అయ్యర్ చాలా కాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. 2023లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అయ్యర్ ప్రదర్శన ఆధారంగా ఆసియా కప్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, తిలక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తమ స్థానాలను పదిలం చేసుకోనున్నారు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్‌‌‌ స్థానానికి ఢోకా లేదని తెలుస్తోంది. అయితే, తుది జట్టులో చోటు దక్కుతుందా? అంటే చెప్పలేం. ఇక, బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకు జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి.

రింకు సింగ్‌పై వేటు?

టీ20ల్లో కొంతకాలంగా రింకు సింగ్ ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. అయితే, ఆసియా కప్‌కు మాత్రం అతన్ని దూరం పెట్టనున్నట్టు పలు నివేదికలు అంచనా వేశాయి. గత రెండు సిరీస్‌ల్లో అతని ప్రదర్శనే అందుకు కారణంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలో గత 7 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అలాగే, ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేదు. 13 మ్యాచ్‌ల్లో 206 రన్సే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది.

Next Story