- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asia Cup 2025 : నేడు భారత్, పాక్ పోరు.. టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందా?
ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత్ వర్సెస్ పాక్.. భావోద్వేగాలతో కూడుకున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ చూస్తుంటే మైదానంలో యుద్ధం జరుగుతున్నట్టు ఉంటుంది. ఆటగాళ్ల కవ్వింపులు, ఉత్కంఠభరిత క్షణాలు, చివరి వరకూ టెన్షన్ టెన్షన్.. ఇలా ఈ దాయాదుల పోరు ఆరంభం నుంచి చివరి వరకూ రసవత్తరమే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధానత్య సంతరించుకుంది. ఇకవైపు పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న డిమాండ్ కూడా భారత్ అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడబోతుంది. నేడు దుబాయ్ వేదికగా ఈ పోరు జరగనుంది. మరి, పాక్‌పై ఆధిపత్యం కలిగిన టీమిండియా ఎప్పటిలాగే తమ జోరును కొనసాగిస్తుందా?..
ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. అన్నీ సప్పగానే సాగాయి. ఇందులో భారత్, పాక్ చెరో మ్యాచ్‌లు ఆడాయి. అవి కూడా ఏకపక్షమే. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్, పాక్ పోరే. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈపై విజయంతో భారత్ జోరు మీద ఉంది. మరోవైపు, ఒమన్‌పై గెలుపుతో పాక్ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. కొంతకాలంగా టీ20ల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే, 8 టీ20 సిరీస్‌లు ఆడితే అందులో ఏడింట విజయం సాధించింది. సౌతాఫ్రికాతో డ్రా చేసుకుంది. భారత్ పోలిస్తే పాక్ జట్టు పరిస్థితి దారుణం. ఆ జట్టు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది నుంచి 11 టీ20 సిరీస్‌ల్లో పాల్గొంటే ఐదింట మాత్రమ గెలిచింది. అది కూడా ఐర్లాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపైన. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో దారుణంగా పరాజయం పాలైంది. ఈ ఏడాది బంగ్లాదేశ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోవడం ఆ జట్టు ప్రదర్శన ఎంత దిగజారిందో తెలియజేస్తుంది. పాక్‌ను చిత్తు చేయడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, టీ20ల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి, సూర్య సేన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
ఫేవరెట్ భారతే
ఈ పోరులో టీమిండియానే స్పష్టమైన ఫేవరెట్. పాక్‌పై గత చరిత్రే కాకుండా ప్రస్తుతం భారత ఆటగాళ్ల ఫామ్‌ను బట్టి టీమిండియాను ఫేవరెట్‌గా చెప్పొచ్చు. కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలు లేకపోయినా జట్టుకు ఏ లోటు లేదు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి బలమైన బ్యాటింగ్ దళం కలిగి ఉంది. ఇందులో ఏ ఇద్దరూ చెలరేగిన పాక్ చిత్తవడం ఖాయమే. క్రీజులోకి రాగానే మీద పడే అభిషేక్, సూర్యలను తట్టుకోవడం పాక్ బౌలర్లకు కత్తిమీద సామే. ఇక, హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ అంటేనే రెచ్చిపోవడం అతని నైజం. అతనికితోడు శివమ్ దూబె, అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్టార్ పేసర్ బుమ్రాను ఎదుర్కొని నిలబడటం పాక్ బ్యాటర్లకు అగ్నిపరీక్షే. అతనికితోడు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు పాక్‌ను బెంబేలెత్తిస్తున్నారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం. గత మ్యాచ్‌లో కుల్దీప్ 5 వికెట్లతో చెలరేగాడు. పాక్‌పై కుల్దీప్, వరుణ్ ద్వయం స్పిన్ మాయలో పడకుండా పాక్ బ్యాటర్లు ఉండటం కష్టమే.
పాక్‌లో వీళ్లు
భారత్‌తో పోలిస్తే పాక్‌పైనే ఒత్తిడి ఎక్కువ. కానీ, ఆ జట్టు జట్టును కూడా పూర్తిగా తీసిపారేయడానికి లేదు. కెప్టెన్ అఘా సల్మాన్, మహ్మద్ హరిస్, హసన్ నవాజ్, సైమ్ అయూబ్ వంటి బ్యాటర్లు కీలకంగా మారనున్నారు. ఇటీవల బంగ్లాపై హరిస్ సెంచరీ చేశాడు. అంతుకుముందు న్యూజిలాండ్‌పై హసన్ నవాజ్ మెరుపు శతకం బాదాడు. అలాగే, ఆ జట్టు ఎక్కువగా బౌలింగ్‌పైనే ఆధారపడి ఉంది. పేసర్ షాహీన్ అఫ్రిది ప్రమాదకరం. అతనితోపాటు ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఫహీమ్ ఆష్రఫ్, మహ్మద్ నవాజ్ నుంచి సవాల్ తప్పదు.
భారత్‌దే ఆధిపత్యం
ఆసియా కప్ పోరులో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. వన్డేలైనా, టీ20లైనా మనదే పైచేయి. మొత్తంగా ఇరు జట్లు 19 సార్లు తలపడితే అందులో 10 సార్లు టీమిండియానే గెలిచింది. ఆరుసార్లు మాత్రమే పాక్ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇందులో మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్ రెండు నెగ్గగా.. పాక్ ఒక్కటి గెలిచింది. ప్రస్తుతం ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 13 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 9 మ్యాచ్‌ల్లో భారత్ గెలవగా.. మూడింటి మాత్రమే ప్రత్యర్థిది గెలిచింది. మరో మ్యాచ్ టై అయ్యింది.
మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, పాక్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. భారత్‌లో సోనీ లైవ్‌లో మ్యాచ్ స్ట్రీమింగ్ అవుతుంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1హెచ్‌డి, సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్‌డీ టీవీ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. తెలుగు చూడాలంటే సోనీ స్పోర్ట్స్ టెన్ 4లో వీక్షించొచ్చు. అలాగే, సోనీ లైవ్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.






