Asia Cup 2025 : వికెట్ కీపర్‌గా ఎవరు?.. రేసులో ఆరుగురు

by Harish |

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది.

Asia Cup 2025 : వికెట్ కీపర్‌గా ఎవరు?.. రేసులో ఆరుగురు
X

దిశ, స్పోర్ట్స్ : సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ సారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. మరికొద్ది రోజుల్లో ఈ టోర్నీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. అయితే, టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20 జట్టు ఎంపిక అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి సవాల్‌గా మారింది. తీవ్ర పోటీ ఉండటమే అందుకు కారణం. ఒక్క వికెట్ కీపర్ స్థానం కోసమే ఏకంగా ఆరుగురు(గాయపడిన రిషబ్ పంత్ కాకుండానే) పోటీపడుతున్నారు. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జితేశ్ వర్మ, ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రేసులో ఉన్నారు. దీంతో సెలెక్టర్ల మధ్య వికెట్ కీపర్‌‌గా ఎవరిని తీసుకుందామన్న చర్చ జరుగుతుంది. అయితే, ఇక్కడ డిస్కషన్ కేవలం వికెట్ కీపింగ్ గురించి మాత్రమే కాదు. టీ20 క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా కీలకం. అతను కీపింగ్ బాధ్యతలే కాకుండా బ్యాటింగ్ భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. అందుకే మిడిలార్డర్ బ్యాటర్ లేదా ఫినిషర్ రోల్‌కు న్యాయం చేసే వికెట్ కీపర్ కోసం సెలెక్టర్లు చూస్తున్నారు.

సంజూ శాంసన్

సంజూ శాంసన్ రేసులో అందరి కంటే ముందున్నాడు. గత 12 నెలల్లో అతను 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 26 ఇన్నింగ్స్‌ల్లో 838 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 160కిపైగా ఉంది. అయినప్పటికీ భారత జట్టులో అతనికి చోటు దక్కుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అతను టాపార్డర్ బ్యాటర్ కావడం ఒక కారణమైతే.. నిలకడలేమి మరో కారణం. ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. చివరగా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌‌లో నిరాశపరిచాడు. గత 12 నెలల్లో ఐదుసార్లు డకౌటవ్వగా.. మూడు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు, టాప్-5 బ్యాటింగ్ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది. గిల్ తిరిగి టీ20ల్లోకి వస్తే ఓపెనర్ అతనే కావడం ఖాయం. మరో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది. మూడో స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్‌లతో పోటీ తప్పదు. ఇక, మిడిలార్డర్‌లో తీసుకుందామంటే అక్కడ శాంసన్ ఆట ఏ మాత్రం బాగాలేదు. 18 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా గొప్పగా రాణించలేదు. కాబట్టి, అతని ఎంపికపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేం.

కేఎల్ రాహుల్

వికెట్ కీపర్ రోల్ కోసం మరో ఎంపిక కేఎల్ రాహుల్. కానీ, అతను చాలా కాలంగా టీ20లకు దూరంగా ఉన్నాడు. 2022లో చివరిసారిగా భారత్‌కు ఆడాడు. అయితే, ఈ సీజన్ ఐపీఎల్‌లో రాహుల్ అదరగొట్టాడు. 13 మ్యాచ్‌ల్లో 539 రన్స్ చేశాడు. అందులో ఓ శతకంతోపాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే ఫామ్‌ను ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కొనసాగించాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 532 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు రాహుల్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే, శాంసన్ పరిస్థితే రాహుల్‌ది కూడా. ఐపీఎల్‌లో రాహుల్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, టాప్-5 స్థానాల్లో చాలా ఆప్షన్లు ఉండటం అతని అవకాశాలను పరిమితం చేస్తుంది. అయితే, ఏ స్థానంలోనైనా రాహుల్ బ్యాటింగ్ చేయగలడు. మరి, సెలెక్టర్లు రాహుల్‌ను ఎంపిక చేస్తారో లేదో చూడాలి.

జితేశ్ శర్మ

యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ‌ను సెలెక్టర్ల దృష్టి ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఫినిషర్‌గా ఆకట్టుకున్నాడు. 261 రన్స్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 85 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ హిట్టింగ్, అద్భుతమైన స్ట్రైక్ రేట్ అతన్ని పోటీలో ఉంచాయి. టీ20 వరల్డ్ కప్‌-2026ని దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేయనుండటంతో జితేశ్‌కు కూడా అవకాశాలు ఉన్నాయి.

ధ్రువ్ జురెల్

మిడిలార్డర్ బ్యాటింగ్ ఎంపికగా ధ్రువ్ జురెల్‌ను చూడొచ్చు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున జురెల్ 13 ఇన్నింగ్స్‌ల్లో 333 రన్స్ చేశాడు. పలు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కూడా ఫినిషర్ రోల్ పోషించాడు. టెస్టుల్లో ఫస్ట్ చాయిస్ బ్యాకప్‌‌గా అతన్ని పరిగణిస్తున్నారు. టీ20ల్లో కూడా అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇతర ఆప్షన్లుగా ఉన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన ఇషాన్ ఆ తర్వాత నిలకడగా రాణించలేకపోయాడు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ తరపున ప్రభ్‌సిమ్రాన్ 549 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. వాళ్లిద్దరూ కూడా టాపార్డర్ బ్యాటర్లు కావడంతో వారికి అవకాశాలు చాలా తక్కువే.


Next Story